వైఎస్ షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశం?

February 09, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ తెలంగాణ ప్రజలకు కొత్తకాదు. గతంలో ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేసారు కూడా. ఏపీలో జగన్ సిఎం అయిన తరువాత ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఆ మద్య ప్రముఖ తెలుగు పత్రిక ఆంధ్రజ్యోతి వరుసగా వార్తలు ప్రచురించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోదరుడు జగన్‌తో  విభేదాల కారణంగానే ఆమె తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టాలని ఆలోచిస్తున్నారంటూ ఆ వార్తల సారాంశం. అయితే అవి నమ్మశక్యంగా లేకపోవడంతో వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వార్తలలో ఎంతోకొంత నిజముందని నిరూపిస్తూ నేడు షర్మిళ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో తెలంగాణ వైసీపీ నేతలతో సమావేశం కానున్నారు.

ఈరోజు ఉదయం 11 గంటలకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో ఆమె సమావేశం కాబోతున్నాని సూర్యాపేట జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిట్టా రామిరెడ్డి తెలిపారు. ఆ తరువాత తెలంగాణలో అన్ని జిల్లాల నేతలతో ప్రతీ రెండు రోజులకు ఒక ఉమ్మడి జిల్లా నేతలతో ఆమె వరుసగా సమావేశం అవుతారని చెప్పారు. రాష్ట్రంలో షర్మిళ పాదయాత్రకు ఏర్పాటుచేసిన నేతలు, పాదయాత్రలో పాల్గొన్నవారికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం.   

కనుక షర్మిళ కొత్త పార్టీ పెడతారా లేదా రాష్ట్రంలో వైఎస్సార్ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేస్తారాఅనేది పక్కనపెడితే రాష్ట్ర రాజకీయాలలో ఆమె ప్రవేశించబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇది ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయమా లేదా ఆమె సొంత నిర్ణయమా? అసలు ఇంత హటాత్తుగా ఆమె తెలంగాణ రాజకీయాలలో మళ్ళీ ఎందుకు ప్రవేశిస్తున్నారు? అనేది ఇంకా తెలియవలసి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ఆమె తెలంగాణ రాజకీయాలలో ప్రవేశిస్తే ఇది అధికార టిఆర్ఎస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలకు పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. తెలంగాణ రాజకీయాలలో షర్మిళ ఎంట్రీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post