వాకవుట్ చేద్దామా...డుమ్మా కొడదామా? మజ్లీస్‌ సందిగ్దం

February 08, 2021


img

ఈనెల 11న గ్రేటర్ ఎన్నికలలో గెలిచిన కొత్త కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం వారు మేయర్, డెప్యూటీ మేయర్లను ఎన్నుకోవలసి ఉంది. అయితే ఈసారి టిఆర్ఎస్‌ కేవలం 56 స్థానాలు మాత్రమే గెలుచుకొన్నందున ఎక్స్‌ అఫీషియో సభ్యుల మద్దతుతో ఆ రెండు పదవులు సొంతం చేసుకోనుంది. సీల్డ్ కవరులో  మేయర్, డెప్యూటీ మేయర్ల పేర్లను పంపిస్తానని, వారికి అందరూ మద్దతు తెలిపి గెలిపించుకోవాలని సిఎం కేసీఆర్‌ చెప్పడమే అందుకు నిదర్శనం. కనుక ఈవిషయంలో టిఆర్ఎస్‌కు స్పష్టత ఉన్నట్లే అర్దమవుతోంది.

అయితే గ్రేటర్ ఎన్నికలకు ముందువరకు అంటకాగిన టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీలు తమతమ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ ఎన్నికల సమయంలో దూరం అయ్యాయి లేదా దూరం అయినట్లు నటించాయి. కనుక ఇప్పుడు పరస్పరం బహిరంగంగా సహకరించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్ ఎన్నికలలో 44 సీట్లు గెలుచుకొన్న మజ్లీస్‌ పార్టీ ఈ తొలి పాలకమండలి సమావేశంలో పాల్గొంటే మేయర్, డెప్యూటీ మేయర్ల ఎన్నికలో పాల్గొని టిఆర్ఎస్‌ అభ్యర్ధులకు అనుకూలంగానో... వ్యతిరేకంగానో ఓట్లు వేయవలసివస్తుంది. ఏవిధంగా చేసినా మజ్లీస్‌కు ఇబ్బందే కనుక ఆ రోజు తమ సభ్యుల ప్రమాణస్వీకారం పూర్తయిన తరువాత ఏదో వంకతో సమావేశం నుంచి వాకవుట్ చేయడమా లేక ఆ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు సమావేశాలకు డుమ్మా కొట్టి తప్పించుకొంటే మంచిదా?అని తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం. దీనిపై ఏవిధంగా ముందుకు సాగాలని మజ్లీస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఒకవేళ ఫిబ్రవరి 11న మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక జరిగేమాటయితే ఆలోగా మజ్లీస్‌ వైఖరిపై స్పష్టత వస్తుంది.


Related Post