కేసీఆర్‌ ఎందుకు వెనక్కుతగ్గారు?

February 08, 2021


img

మొన్నవరకు టిఆర్ఎస్‌లో అందరూ పోటీలుపడి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ పాట పాడారు. ఇటువంటి అతి కీలకమైన విషయం గురించి వారు కేసీఆర్‌, కేటీఆర్‌ల ఆమోదం లేకుండా మాట్లాడారనుకోలేము. కానీ నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ‘మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాను... ఇకపై దీనిపై ఎవరూ నోరెత్తడానికి వీలులేదంటూ...’ సిఎం కేసీఆర్‌ వాళ్ళ నోళ్ళు మూయించడమే ఆశ్చర్యకరం. 

ఇన్నిరోజులుగా టిఆర్ఎస్‌లో అందరూ పోటీలు పడి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని చెపుతున్నా వారించని సిఎం కేసీఆర్‌, ఇప్పుడు హటాత్తుగా ఎందుకు రివర్స్ అయ్యారు? అనే సందేహం కలుగకమానదు. దానికి కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

ముఖ్యమంత్రి మార్పు చర్చతో ఒకటి ఆశిస్తే జరుగుతున్నది మరొకటి. దీంతో ప్రజలను, ప్రతిపక్షాలను, మీడియాను మానసికంగా సిద్దం చేయాలని టిఆర్ఎస్‌ అధిష్టానం భావించి ఉండవచ్చు. అయితే టిఆర్ఎస్‌ నేతలు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలతో కేసీఆర్‌ సరైన నిర్ణయాలు తీసుకోలేకనో లేదా ఆరోగ్యకారణాల చేతో తప్పుకోవాలనుకొంటున్నారు. కేసీఆర్‌ కంటే కేటీఆర్‌ సమర్దుడు. కేటీఆర్‌ యువనేత కనుక ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది...’ అనే భావన ప్రజలలో కలిగేలా చేశారని చెప్పవచ్చు. ఇది ఖచ్చితంగా తప్పుడు సంకేతాలు పంపడంగానే భావించవచ్చు.    

ఇక ‘కేటీఆర్‌ ముఖ్యమంత్రి’ చర్చతో ప్రతిపక్షాలు మైండ్ గేమ్ ఆడటం మొదలుపెట్టాయి. కేటీఆర్‌ కంటే మంత్రి ఈటల రాజేందర్‌ ఆ పదవికి అన్ని విధాలా అర్హుడు. కనుక ఆయనకే ఆ పదవి ఇవ్వాలి లేకుంటే కేసీఆర్‌ తన హామీని నిలబెట్టుకొని పార్టీలో దళిత నేతలలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలంటూ వాదనలు మొదలుపెట్టాయి. దీంతో పార్టీలో ముసలం పుట్టే ప్రమాదం ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. 

ఇక త్వరలో రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి మార్పు చర్చతో పార్టీలో అయోమయం నెలకొంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదీగాక దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో సమరోత్సాహంతో దూసుకువస్తున్న బిజెపిని ధీటుగా ఎదుర్కోవలసిన ఈ సమయంలో ముఖ్యమంత్రి మార్పు సరైన సమయం కాదని సిఎం కేసీఆర్‌ భావించి ఉండవచ్చు.


Related Post