దటీజ్ సిఎం కేసీఆర్‌

February 08, 2021


img

తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన నిన్న జరిగిన టిఆర్ఎస్‌ కార్యవర్గ సమావేశం అందరూ ఊహించినదానికి పూర్తి భిన్నంగా సాగిందని చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తాను తప్పుకొని కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం లేదని, మరో 10 ఏళ్ళు తానే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతానని కేసీఆర్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పి ప్రతిపక్షాల, మీడియాతో సహా పార్టీ నేతలు కూడా మూతపడేలా చేశారు. 

మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలోనూ పార్టీలో ఎవరూ నోరెత్తడానికి వీలులేదన్నట్లు సిఎం కేసీఆర్‌ కటువుగా వ్యవహరించడం విశేషం. వారి ఎన్నిక జరిగే రోజు సీల్డ్ కవర్‌లో తాను సూచించినవారికి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులు మరో ఆలోచనచేయకుండా మద్దతు తెలిపి గెలిపించాలని విస్పష్టంగా ఆదేశించారు. 

అదేవిదంగా పార్టీలో ఎవరూ వెర్రిమొర్రి ఆలోచనలు చేయకుండా టిఆర్ఎస్‌ను కాపాడుకోవలసిన అవసరం ఉందని, సభ్యత్వనమోదు కార్యక్రమం మొదలుపెట్టి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని ఆదేశించారు. ఏప్రిల్ 27న పార్టీ 20వ ఆవిర్భావదినోత్సవ వేడుకలను ఆరు లక్షలమందితో ఘనంగా నిర్వహించుకొందామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రంతో పలువిధాలుగా వ్యవహరిస్తుంటానని, దాని గురించి ప్రతిపక్షాలు, మీడియా మాట్లాడే మాటలను ఎవరూ పట్టించుకొనవసరం లేదని సిఎం కేసీఆర్‌ చెప్పారు.  

ఇవన్నీ సిఎం కేసీఆర్‌ నాయకత్వలక్షణాలకు, రాజనీతికి తాజా నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఒక ఒక సమావేశంలో పార్టీలో అందరినీ తన దారికి తెచ్చుకొని వారికి దిశానిర్దేశం చేయడం మామూలు విషయమేమీ కాదు. ముఖ్యంగా దుబ్బాక, గ్రేటర్ ఎదురుదెబ్బలతో అయోమయంలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలందరినీ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ముందు ఈవిధంగా ధైర్యం చెప్పి యుద్ధానికి సిద్దం చేయడం సామాన్యమైన విషయమేమీ కాదు. టిఆర్ఎస్‌లో నెలకొన్న భయాలు, అనుమానాలు, ప్రచారాలు అన్నిటినీ సిఎం కేసీఆర్‌ పటాపంచలుచేసి మార్గదర్శనం చేశారు కనుక ఇక నుంచి టిఆర్ఎస్‌ సమారోత్సాహంతో బిజెపిని ఎదుర్కొనేందుకు సిద్దం అవుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు.


Related Post