ముఖ్యమంత్రి మార్పుపై సిఎం కేసీఆర్‌ స్పష్టత

February 07, 2021


img

ఈరోజు తెలంగాణ భవన్‌లో సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన టిఆర్ఎస్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాను. మరో పదేళ్ళు నేనే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఇదివరకే చెప్పాను.  కానీ సిఎం పదవి మార్పు గురించి పార్టీలో కొందరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. గతంలో ఎన్నో పదవులు తృణప్రాయంగా వదిలేశాను. నాకు పదవులు ముఖ్యం కాదు. రాష్ట్రాభివృద్ధే ముఖ్యం. ఆ లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. మీరందరూ కూడా అదే లక్ష్యంగా పనిచేయాలని కోరుకొంటున్నాను. మన పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందికలిగించే అటువంటి అంశాల గురించి ఎవరూ మాట్లాడవద్దు. ఇకపై ఎవరైనా సిఎం పదవి మార్పు గురించి మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడను,” స్పష్టంగా చెప్పేరు. తద్వారా ఈ ఊహాగానాలకు సిఎం కేసీఆర్‌ స్వయంగా తెర దించారు.

ఈరోజు పార్టీలో… ప్రభుత్వంలో ముఖ్యులందరూ పాల్గొనబోయే కార్యవర్గ సమావేశంలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రతిపాదన చేస్తారనుకొంటే, తానే మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని చెప్పి పార్టీలో అందరికీ... ప్రతిపక్షాలకు... మీడియాకు కూడా సిఎం కేసీఆర్‌ షాక్ ఇచ్చారు. దీంతో టిఆర్ఎస్‌లో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే ఇంతకాలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ ఎందుకు ప్రచారం చేశారు? ఒకవేళ దానికి సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆమోదం లేకుంటే వారిని అప్పుడే ఎందుకు వారించలేదు?ఇప్పుడు హటాత్తుగా సిఎం కేసీఆర్‌ ఎందుకు వెనక్కు తగ్గారు?దీని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? అంటూ రేపటి నుంచి ప్రతిపక్షాలు, మీడియా ప్రశ్నలు సందించకమానవు. కనుక వాటికీ టిఆర్ఎస్‌ సంతృప్తికరమైన సమాధానాలు సిద్దం చేసుకోవవలసి ఉంటుంది.


Related Post