రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల భేరి

February 05, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల భేరి మోగనుంది. వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి(టిఆర్ఎస్‌), హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్‌.రామచంద్రరావు (బిజెపి)ల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. కనుక ఆలోగా ఎన్నికల ప్రక్రియ ముగించవలసి ఉంటుంది కనుక ఆ రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాల రాష్ట్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాలలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ముగించి గత నెల 22న తుది జాబితాను ప్రకటించింది. రెండు నియోజకవర్గాలలో కలిపి సుమారు 10 లక్షల మంది ఓటర్లున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారంరోజులలోగానే నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఫిబ్రవరి రెండోవారం నుంచి రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల కోలాహలం మొదలవుతుందన్న మాట! 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న టిఆర్ఎస్‌కు ఈ ఎన్నికలలో తప్పనిసరిగా గెలవవలసి ఉంటుంది. లేకుంటే రాష్ట్రంలో బిజెపికి దారి కల్పించినట్లవుతుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల ఊపుతో ఉన్న బిజెపి తన సత్తా చాటుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను మరో అవకాశంగా భావిస్తోంది. ఈ ఎన్నికలలో గెలువగలిగితే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమని గుర్తింపు పొందడమే కాకుండా టిఆర్ఎస్‌ను ఓడించగలదనే నమ్మకం ప్రజలలోను, ప్రతిపక్షాలలోనూ కలిగించగలుగుతుంది. కనుక బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడబోతోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకొనేందుకు, మనుగడ కోసం ఈ ఎన్నికలలో గెలవక తప్పని పరిస్థితి. కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగబోతున్నాయి. 


Related Post