త్వరలో నిరుద్యోగ భృతి?

February 05, 2021


img

తెలంగాణలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ఆర్ధికశాఖ 2021-22 బడ్జెట్‌లో సుమారు రూ.7,000 కోట్లు కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుచేసుకొన్న నిరుద్యోగులే సుమారు 25 లక్షల మంది ఉన్నారు. వీరుకాక రాష్ట్రంలో మరో 25 లక్షల మందికి పైగా నిరుద్యోగులున్నారు. వారందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రభుత్వంపై చాలా ఆర్ధికభారం పడుతుంది. కనుక నిరుద్యోగ భృతి పొందేందుకు అర్హతను నిర్ణయించడం ద్వారా ఈ పధకాన్ని 10 లేదా 20 లక్షల మందికి పరిమితం చేసే అవకాశం ఉంది. ఆ లెక్కన చూసుకొన్నా ప్రభుత్వంపై ఏడాదికి రూ.3619-7,238 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3,619 కోట్లు కేటాయిస్తే 10 లక్షల మందికి రూ.7,000 కేటాయిస్తే 20 లక్షలమందికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్దపడుతున్నట్లు అర్దమవుతుంది. 

అయితే 10వ తరగతి ఫెయిల్ అయినవారు మొదలు డిగ్రీ, ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారు. కనుక వారిలో ఎవరెవరికి ప్రభుత్వం ఈ నిరుద్యోగ భృతి ఇస్తుంది? ఎవరిని పక్కనపెడుతుంది?ఎంత వయోపరిమితి నిర్ధారిస్తుంది?వంటివి సిఎం కేసీఆర్‌ ప్రకటన చేస్తేకానీ తెలియదు. 

ప్రస్తుతం బడ్జెట్‌ రూపకల్పనలో వివిదశాఖల ఉన్నతాధికారులతో సిఎం కేసీఆర్‌ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కనుక బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయింపుపై స్పష్టత రాగానే సిఎం కేసీఆర్‌ ప్రకటన చేయవచ్చు. బహుశః పట్టభద్రుల ఎన్నికలకు ముందు వరుసగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేసి అదే సమయంలో నిరుద్యోగభృతిపై కూడా సిఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.


Related Post