ఈటలను సీఎం చేస్తే బాగుంటుంది: జీవన్‌రెడ్డి

February 04, 2021


img

టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలు కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ పాట పాడటం ఆపేశారు కానీ ప్రతిపక్షాలు మాత్రం వారి పాటకు చరణం కట్టి కొత్తరాగం ఆలపిస్తూ టిఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగిస్తున్నాయి. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఒకవేళ సిఎం కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి తప్పుకోదలిస్తే తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కంటే పార్టీలో సీనియర్ (ఉద్యమ) నాయకుడు, అపార రాజకీయ, పరిపాలనానుభవం కలిగిన ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుంది. కేటీఆర్‌ సమర్దుడే కానీ ఆయన ప్రతిపక్షాలపై నోటికి ఎంతవస్తే అంతా విమర్శలు చేస్తుంటారు. అదే.. ఈటల రాజేందర్‌ అయితే చాలా మృదుస్వభావి ... ఆచితూచి చాలా హుందాగా మాట్లాడుతారు. టిఆర్ఎస్‌లో మంచి సామాజిక దృక్పదం ఉన్న నాయకుడు ఆయన. కనుక ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం,” అని అన్నారు. 

ఇంతకు ముందు మరికొంత మంది ప్రతిపక్షనేతలు కూడా ఇదేవిదంగా మాట్లాడారు. ఈటల రాజేందర్‌ను ముఖ్యమంత్రి చేయాలని ప్రతిపక్షాలు చెపుతుండటంపై టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఈటల రాజేందర్‌ సైతం వారి మాటలపై స్పందించలేని పరిస్థితి నెలకొంది. టిఆర్ఎస్‌కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే కనుక ప్రతిపక్షాలకు బహుశః మంత్రి ఈటల రాజేందర్‌ ద్వారానే సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తారేమో సిఎం కేసీఆర్‌? 


Related Post