రాష్ట్ర ఆదాయంలో గ్రేటర్ షేర్ రూ.600 కోట్లు

February 04, 2021


img

రాష్ట్ర ఆదాయంలో రాజధాని హైదరాబాద్‌ నుంచి వచ్చేదే ఎక్కువని…దాంతోనే రాష్ట్రంలో మిగిలిన జిల్లాలకు నిధులు అందుతున్నాయని వేరే చెప్పక్కరలేదు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల ద్వారా లభించిన ఆదాయంలో కూడా హైదరాబాద్‌ వాటాయే ఎక్కువగా ఉండటం విశేషం. 

గత నెలలో రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలలో జరిగిన వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.930 కోట్లు ఆదాయం లభించింది. దానిలో రూ.600 కోట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నుంచే సమకూరినట్లు రెవెన్యూ అధికారులు లెక్కకట్టారు. 

జనవరి నెలలో రాష్ట్రంలో మొత్తం 48,000 వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు జరుగగా వాటి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.60.75కోట్లు ఆదాయం సమకూరింది. 

అదేవిదంగా జనవరి నెలలో 1,96,225 వ్యవసాయేతర ఆస్తులు అంటే ఇళ్ళ స్థలాలు, లేఅవుట్లు, అపార్టుమెంట్లు వగైరాల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.869.25 కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 

గత ఏడాది మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల ద్వారా అత్యధికంగా రూ.750 కోట్లు ప్రభుత్వానికి రాబడి వచ్చింది. కొత్త రెవెన్యూ చట్టంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అవరోధాలను తొలగించి సరళీకరించడంతో ఈ ఏడాది జనవరి నుంచే రిజిస్ట్రేషన్లు జోరందుకొన్నాయి. దాంతో జనవరి నెలలోనే రూ. 930 కోట్లు ఆదాయం సమకూరింది. 

గత ఏడాది మొత్తం కరోనా... లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అన్నీ మూతపడటంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోయి ఉద్యోగుల జీతాలు కూడా కోయవలసివచ్చింది. కానీ ఈ ఏడాది జనవరి నుంచే కోలుకొని ఇంత పుంజుకోవడం విశేషమే. రాష్ట్ర ఆదాయం పెరిగితే మళ్ళీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోరుగా సాగుతాయి కనుక ప్రభుత్వానికి, ప్రజలకీ అందరికీ చాలా సంతోషకరమైన విషయమే.


Related Post