తమిళనాడు ఎన్నికలలో కేసీఆర్‌ జోక్యమేల? రేవంత్‌ రెడ్డి

February 04, 2021


img

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సిఎం కేసీఆర్‌పై అనూహ్యమైన విమర్శలు చేశారు. పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న రేవంత్‌ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆయనను కేసుల పేరుతో భయపెట్టి లొంగదీసుకున్నారు. అందుకే సిఎం కేసీఆర్‌ తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం ఆ రాష్ట్ర బిజెపికి నిధులు అందిస్తున్నారు. తెలంగాణ నిఘా అధికారులను తమిళనాడుకు పంపించి అక్కడి రాజకీయ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకొంటున్నారు. సిఎం కేసీఆర్‌ సూచన మేరకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డిని తమిళనాడు బిజెపి ఎన్నికల ఇన్‌ఛార్జిగా నియమించింది. తమిళనాడు రాజకీయాలలో సిఎం కేసీఆర్‌ జోక్యం చేసుకోవలసిన అవసరం ఏమిటి? రాష్ట్రానికి చెందిన సొమ్మును తమిళనాడు బిజెపికి ఎందుకు ఇస్తున్నారు?” అని ప్రశ్నించారు. 

ఇంతకు ముందు బిహార్‌ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన మజ్లీస్‌ పార్టీకి కూడా సిఎం కేసీఆర్‌ నిధులు, సహాయసహకారాలు అందించారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు తమిళనాడు బిజెపికి నిధులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు రేవంత్‌ రెడ్డి సాక్ష్యాధారాలు కూడా చూపించి ఉంటే నమ్మశక్యంగా ఉండేది. అయినా రాష్ట్రాలకు నిధులు ఇచ్చే కేంద్రప్రభుత్వం తమిళనాడులో బిజెపి కోసం సిఎం కేసీఆర్‌ను సాయం అడగాల్సిన అవసరం ఏమిటి? కేంద్రం చేతిలోనే సిబిఐ, ఎన్ఐఏ వంటి బలమైన నిఘా సంస్థలు ఉండగా తెలంగాణ నిఘా సంస్థ సాయం దేనికి?ఒకవేళ బిజెపి పట్ల కటిన వైఖరి అవలంభించదలిస్తే ఆ విషయం కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంగానే చెపుతారు. ఒకవేళ బిజెపి పట్ల మెతక వైఖరి అవలంభించదలిస్తే పార్లమెంటులో బిల్లులు ఆమోదింపజేసుకోవడంలో కేంద్రానికి తోడ్పడతారు తప్ప ఇరుగుపొరుగు రాష్ట్రాల రాజకీయాలలో ఎందుకు తల దూరుస్తారు? అని ఆలోచిస్తే రేవంత్‌ రెడ్డి ఆరోపణలు అర్ధరహితంగా కనిపిస్తాయి.


Related Post