వ్యవసాయ చట్టాలపై టిఆర్ఎస్‌ వైఖరి మారిందా?

February 04, 2021


img

కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను టిఆర్ఎస్‌ మొదట్లో గట్టిగా వ్యతికించడమే కాకుండా దానికి మద్దతుగా రాష్ట్రంలో బంద్‌ కూడా నిర్వహించింది. కానీ సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసివచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్‌ వైఖరిలో మార్పు వచ్చింది. తాజాగా టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిన్న రాజ్యసభలో దాని గురించి మాట్లాడింది వింటే అవుననిపిస్తుంది. 

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంలో మాట్లాడుతూ “వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు మొండిపట్టుపట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ చట్టాలను సవరించడానికి కేంద్రప్రభుత్వం అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. రైతు సంఘాలతో కేంద్రప్రభుత్వం పలుమార్లు చర్చలు జరపడం చాలా మంచి విషయమే కానీ వారితో ఏమి చర్చించిందనే విషయం సభకు తెలియజేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. రైతుల ప్రయోజనం కోసమే ఆ చట్టాలను చేశామని చెపుతున్నప్పుడు, దానిలో లోపాలను సవరించడానికి వెనకాడవలసిన అవసరం లేదు. వాటిపై పార్లమెంటులో మళ్ళీ చర్చించి చట్టసవరణలు చేయాలని కోరుతున్నాను. ఆనాడు వాటిపై సభలో లోతుగా చర్చించి పద్దతి ప్రకారం ఓటింగ్ జరిపించి ఉంటే ఈ దుస్థితి వచ్చేదికాదు. ఆ చట్టాలను రాజ్యసభలో బలప్రయోగంతో (మూజువాణి ఓట్లతో) ఆమోదించారు. కనుక వాటి గురించి సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయకమునుపే వాటిపై పార్లమెంటులో చర్చించి సవరించడం మంచిది. అలాగే రైతులకు మద్దతు ధర ఇస్తామని కేంద్రప్రభుత్వం పదేపదే చెపుతున్నప్పుడు, వారికి నమ్మకం కలిగేలా ఆ హామీకి చట్టబద్దత కల్పిస్తే బాగుంటుంది కదా?కానీ ఎందుకు వెనకాడుతోంది? తెలంగాణలో మా ప్రభుత్వం మద్దతుధరకు చట్టబద్దత కల్పిస్తుంది,” అని కె.కేశవరావు అన్నారు.    

మొదట ఆ వ్యవసాయ చట్టాలే వద్దన్న టిఆర్ఎస్‌ ఇప్పుడు వాటికి సవరణలు చేస్తే సరిపోతుందని చెప్పడం వైఖరిలో మార్పుగానే భావించవచ్చు. ఈ మార్పుకు కారణం ఏమిటో?


Related Post