ఈసారైనా కోదండరాం కల నెరవేరేనా?

February 03, 2021


img

తెలంగాణ సాధనలో ప్రొఫెసర్ కోదండరాం కీలకపాత్ర పోషించిన సంగతి అందరికీ తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ఆయనను శత్రువుగా చూస్తూ ఆయనపై ‘తెలంగాణ వ్యతిరేకి’ ముద్ర ఎందుకు వేసిందో తెలీదు. రైతు సమస్యలు, ప్రజాసమస్యలు, ఉద్యోగాల భర్తీ వంటి పలు అంశాలపై గట్టిగా మాట్లాడుతుండటమే అందుకు కారణమనుకోలేము. కారణాలు ఏవైనప్పటికీ ఆయన తెలంగాణ జనసమితితో ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి తన పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే వాటితో ఫలితం కనిపించకపోవడంతో ఎన్నికలలో పోటీ చేసి చట్టసభలలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేసినప్పటికీ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఒంటరిగా మండలి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. కానీ టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య జరుగబోయే భీకరమైన పోరులో ఒంటరిగా బరిలో దిగుతున్న ప్రొఫెసర్ కోదండరాం వాటిని ఎదుర్కొని పొరాడి గెలవగలరా? అంటే సమాధానం... దానికి కారణాలు అందరికీ తెలుసు. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఈ ఎన్నికలలో గెలుపుకోసం టిఆర్ఎస్‌ సర్వశక్తులు ఒడ్డి పోరాడబోతోంది. అలాగే ఆ రెండు ఎన్నికలలో గెలిచి సమరోత్సాహంతో ఉన్న బిజెపి ఈ ఎన్నికలలో కూడా గెలిచి మరోమారు తన సత్తాను చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. తద్వారా రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు బిజెపికి గుర్తింపు లభిస్తుంది కూడా. ఇక వరుస ఓటములతో నీరసించిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని తాపత్రయపడుతోంది. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు పార్టీల మద్య చాలా తీవ్రమైన పోటీ ఉండబోతోంది. కనుక ప్రొఫెసర్ కోదండరాం కలనెరవేరుతుందో లేదో అనుమానమే. 


Related Post