నాసా అధినేతగా భవ్యాలాల్

February 03, 2021


img

భారత్‌కు చెందిన మరో మహిళకు అమెరికాలో కీలక పదవీబాధ్యతలు అప్పగించబడ్డాయి. ఆమే... భారత్‌కు చెందిన భవ్యలాల్‌...అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’కు చీఫ్ ఆఫ్‌ స్టాఫ్‌’గా నియమితులయ్యారు. దాంతోపాటు నాసా ‘బడ్జెట్‌ అండ్ ఫైనాన్స్’ విభాగానికి ‘సీనియర్ అడ్వైజర్‌’ బాధ్యతలు కూడా అప్పగించబడ్డాయి. అంటే నాసా ప్రయోగాల ఆదాయవ్యయాల పద్దులు మొదలు అంతరిక్ష ప్రయోగాల వరకు అన్నిటినీ భవ్యాలాల్ కీలకపాత్ర పోషించబోతున్నారన్న మాట! 

ఇంతకీ ఈ భవ్యలాల్ ఎవరు...ఎక్కడివారు అంటే.. ఆమె ఢిల్లీకి చెందిన మహిళ. బాల్యమంతా ఢిల్లీలోని గడిచింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఢిల్లీలోని గోడ్రేజ్ స్కూల్లో చదువుకొంది. నేటికీ ఆమె తల్లితండ్రులు ఢిల్లీలోనే నివాసం ఉంటున్నారు. భవ్య రెండేళ్ళ వయసుకే పుస్తకాలు చదవడం మొదలుపెట్టిందని ఆమె తల్లితండ్రులు చెప్పారు. చిన్నప్పటి నుంచే పుస్తకపటనమే తప్ప మరో ధ్యాస ఉండేది కాదని ప్రతీ తరగతిలో నూటికి నూరు మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసవుతుండేదని ఆమె తల్లితండ్రులు చెప్పారు. 

భవ్య చిన్నప్పుడు తాను వంటింట్లో పనిచేసుకొంటుంటే అక్కడే కూర్చొని పుస్తకాలు చదువుకోవడం, హోంవర్క్ చేసుకొనేదని ఆమె తల్లి చెప్పారు. తన కొంగు పట్టుకొని తిరిగే చిన్నారి...తమ ఏకైక కుమార్తె భవ్యను ఉన్నత చదువుల కోసం 1987లో అమెరికా పంపించవలసి వచ్చినప్పుడు సర్వం కోల్పోయినట్లు అనిపించేదని ఆమె తల్లితండ్రులు చెప్పారు. 

తమది శుద్ధ శాఖాహారి కుటుంబం కావడంతో అమెరికాలో బతకడం చాలా కష్టం అవుతుందని భయపడేవారిమని, తమ బందువులు, స్నేహితులు అందరూ కూడా భవ్యను అమెరికా పంపవద్దని గట్టిగా చెప్పారని, కానీ భవ్య తెలివితేటలు, ప్రతిభాపాటవాలకు అమెరికాలో తగిన గుర్తింపు లభిస్తుందని అక్కడ ఉన్న తమ శ్రేయోభిలాషులు గట్టిగా చెప్పడంతో ధైర్యం చేసి పంపించామని, చివరికి తమ నిర్ణయం సరైనదనే అని తేలిందని భవ్య తల్లితండ్రులు చెప్పారు. తమ కుమార్తె భవ్య అమెరికాలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా చదువులు పూర్తి చేయడమే కాకుండా ఈ స్థాయికి ఎదగడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భవ్య తల్లితండ్రులు చెప్పారు. 

భవ్యలాల్ డిగ్రీలు: న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ, టెక్నాలజీ అండ్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీ, పబ్లిక్ పాలసీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డాక్టరేట్, ఇంకా మరికొన్ని డిగ్రీలు.      

ఉద్యోగం: ఎస్టీపీఎస్ అనే సంస్థలో టెక్నాలజీ విభాగానికి ప్రెసిడెంట్‌గా చేశారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టడీస్‌కు డైరెక్టర్‌గా చేశారు. 2005-2020 వరకు వాషింగ్‌టన్‌లోని నాసాకు అనుబందంగా పనిచేసే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధనలు చేశారు. వైట్‌హౌస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి సలహాదారుగా పనిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జో బైడెన్‌ బృందంలో సభ్యురాలిగా ఉంటూ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగానికి సంబందించి బైడెన్ విధానాలను రూపొందించారు. జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడుకావడంతో ఇప్పుడు భవ్యలాల్‌కు ఈ కీలక పదవీబాధ్యతలు అప్పగించబడ్డాయి.


Related Post