మంత్రి ఈటల అందుకే అలా అన్నారేమో?

February 02, 2021


img

టిఆర్ఎస్‌ పార్టీలో... ప్రభుత్వంలో కాస్త ధైర్యంగా మాట్లాడే ఏకైక నాయకుడు మంత్రి ఈటల రాజేందర్‌ అని చెప్పవచ్చు. ప్రభుత్వ విధానాలపై కావచ్చు... పార్టీ పరంగా కావచ్చు... అప్పుడప్పుడు తన అభిప్రాయాలను సుత్తిమెత్తగా బయటపెడుతుంటారు. నిన్న కరీంనగర్‌ జిల్లా పర్యటనలో రైతుబంధు పధకాన్ని ధనవంతులు, రాజకీయనాయకులకు వర్తింపజేయడాన్ని తప్పుపట్టారు. తాను మంత్రిగా ఉండవచ్చు లేదా మరో పదవిలో ఉండవచ్చు అంటూ ఈటల రాజేందర్‌ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నిరుపేదలైన కౌలు రైతులకు రైతుబంధు పధకం ఎంతో అవసరం కానీ వారికి ఇస్తే సమస్యలు ఎదుర్కోవలసివస్తుందని చెపుతూ వారికి ఇవ్వకుండా రాష్ట్రంలో ధనవంతులు, రాజకీయనాయకులకు, భూస్వాములకు ఇస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నప్పటికీ సిఎం కేసీఆర్‌ దానిపై పునరాలోచన చేయలేదు. అంతమాత్రన్న పార్టీలో, ప్రభుత్వంలో అందరూ సిఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు కాదని మంత్రి ఈటల రాజేందర్‌ తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది. 

ఇక ‘తాను మంత్రిగా ఉండవచ్చు లేదా మరో పదవిలో ఉండవచ్చు...’ అంటూ ఈటల రాజేందర్‌ యధాలాపంగా అన్నారనుకోలేము. త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ టిఆర్ఎస్‌ నేతలు గట్టిగా చెపుతున్నారు కనుక కేటీఆర్‌ మంత్రివర్గంలో తనను తీసుకొంటారో లేదో అనే అనుమానం కలిగి ఉండవచ్చు. బహుశః అందుకే మంత్రి ఈటల రాజేందర్‌ అలా అన్నారేమో?


Related Post