టిఆర్ఎస్‌ను ఎదుర్కోవడానికి బిజెపికి దారి దొరికినట్లేనా?

February 02, 2021


img

తెలంగాణ రాజకీయాలలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు ముందు...తరువాత అన్నట్లు చెప్పుకొనే రోజులు వచ్చినట్లే ఉన్నాయి. బండి సంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండే రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని చాటుకోవడం మొదలైంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో విజయం తరువాత రాష్ట్రంలో బిజెపి మరింత జోరుగా దూసుకుపోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. మొన్న వరంగల్‌లో టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి, నిన్న సిరిసిల్లా జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటనను సైతం అడ్డుకొనే ప్రయత్నం చేయడం వంటివి అందుకు తాజా నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. ఇక బండి సంజయ్‌ సంగతి చెప్పక్కరలేదు. నిత్యం ఆయన సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తుంటారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వ అవినీతికి పాల్పడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 

గత ఆరేళ్ళుగా టిఆర్ఎస్‌ ఆడిందే ఆట... పాడిందే పాట అన్నట్లు సాగుతుండేది. టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి ఇక ఎదురేలేదన్నట్లు సాగుంతుండగా హటాత్తుగా ఈ బండి సంజయ్‌ ఊడిపడి టిఆర్ఎస్‌కు చుక్కలు చూపిస్తున్నారు. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఎదుర్కొని దెబ్బ తీయవచ్చనే ఫార్ములాను బండి సంజయ్‌ కనుగొన్నట్లే ఉన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీలు కలిసి ఉన్నంతకాలం టిఆర్ఎస్‌ను ఎవరూ ఏమీ చేయలేరని గ్రహించిన బండి సంజయ్‌ ముందుగా హిందూ ఓటర్లను ఆకట్టుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. దాంతో ఆయన ఊహించినట్లుగానే గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌-మజ్లీస్‌ పార్టీల మద్య బలమైన బంధాన్ని తెగొట్టగలిగారు. హైదరాబాద్‌లో హిందూ ఓటర్లను బిజెపి ఆకర్షిస్తుందనే భయంతోనే మజ్లీస్‌కు టిఆర్ఎస్‌ దూరం అయ్యిందని అర్ధమవుతూనే ఉంది. కానీ మజ్లీస్‌ను టిఆర్ఎస్‌ దూరంగా పెట్టినా గ్రేటర్ ఎన్నికలలో బిజెపి 48 సీట్లు గెలుచుకొంది. అంటే ఈ ఫార్ములా వర్కవుట్ అయినట్లే స్పష్టమైంది. ఈ ఫార్ములాతో మజ్లీస్‌ను టిఆర్ఎస్‌కు దూరం చేయడమే కాకుండా వాటిని ఎంతో కొంత బలహీనపరచడం సామాన్యమైన విషయం కాదనే చెప్పాలి.

ఇప్పుడు బిజెపి రాష్ట్రంలో అయోధ్య రామాలయం నిర్మాణానికి విరాళాలు సేకరిస్తోంది. దాంతో ప్రజలలో హిందూ సెంటిమెంట్‌ రగులుతుందని వేరే చెప్పక్కరలేదు. ఈవిషయం టిఆర్ఎస్‌ కూడా గుర్తించినట్లే ఉంది. కానీ దానిపై టిఆర్ఎస్‌ ఎంత మాట్లాడితే అంతా బిజెపికి లాభం చేకూర్చినట్లే అవుతుంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ అంశంపై నోరువిప్పి మాట్లాడితే దాంతో బిజెపి ఏవిధంగా అల్లుకుపోయిందో అందరూ చూశారు. కనుక టిఆర్ఎస్‌ మౌనం వహించక తప్పడం లేదు. ఇది బిజెపికి కలిసివచ్చే అంశమే అని చెప్పవచ్చు. 

ఇక మజ్లీస్‌, బిజెపి పార్టీలకు లేని ఓ ఇబ్బంది టిఆర్ఎస్‌కుంది. మజ్లీస్‌, బిజెపిలు హిందూ ముస్లింలు, మతాల గురించి నిర్భయంగా మాట్లాడగలవు. మత రాజకీయాలు చేయగలవు. కానీ టిఆర్ఎస్‌ అలా మాట్లాడలేదు... చేయలేదు. ఒకవేళ హిందువులను వెనకేసుకువస్తూ గట్టిగా మాట్లాడితే ముస్లింలకు, మజ్లీస్‌కు కోపం వస్తుంది. ఎన్నికలలో వారి ఓట్లు నష్టపోవలసివస్తుంది. అలాగని ముస్లింలను వెనకేసుకువస్తే హిందువులకు ఆగ్రహం కలుగుతుంది. బిజెపికి అవకాశం కల్పించినట్లవుతుంది. ఈ రహస్యం బండి సంజయ్‌ కనిపెట్టినట్లే ఉన్నారు. అందుకే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి హిందూ సెంటిమెంట్‌తోనే ముందుకు సాగుతున్నారని భావించవచ్చు. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు బండి సంజయ్‌ ఓ ఫార్ములాను కనిపెట్టారు కనుక దాంతోనే బిజెపి దూసుకుపోతోంది. ఒకవేళ టిఆర్ఎస్‌ నేతలు ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వెంటనే బిజెపి నేతలు స్పందిస్తూ ఆలయాలకు వచ్చి ప్రమాణం చేయాలని సవాళ్ళు విసురుతూ టిఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాష్ట్ర బిజెపిలో వచ్చిన ఈ పెనుమార్పు రాష్ట్ర రాజకీయాలపై మున్ముందు ఎటువంటి ప్రభావం చూపబోతోందో త్వరలో జరుగబోయే వరుస ఎన్నికల ఫలితాలతో తెలియవచ్చు. 


Related Post