అలా మాట్లాడటం తప్పే క్షమించండి: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

February 01, 2021


img

“అయోధ్య రామాలయం నిర్మాణం పేరు చెప్పుకొని బిజెపి నేతలు, కార్యకర్తలు దొంగ చందా పుస్తకాలతో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు రూ.1,000 కోట్లు దండుకొన్నారు. దేశం మొత్తం మీద ఇంకెంత దండుకొంటారో?” అంటూ టిఆర్ఎస్‌ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. ధర్మారెడ్డి వ్యాఖ్యలపై నిరసనలు తెలియజేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నారు. 

వరంగల్‌లో నిన్న ధర్మారెడ్డి ఇంటిపై బిజెపి కార్యకర్తలు రాళ్ళు రువ్వడాన్ని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గట్టిగా ఖండించి, ఆయనకు అండగా నిలబడతామని చెప్పినప్పటికీ, ఇటువంటి అవకాశాల కోసమే ఎదురుచూస్తున్న బిజెపి దీని అనుకూలంగా మలుచుకొని ముందుకుసాగుతుండటంతో బహుశః టిఆర్ఎస్‌ అధిష్టానం ధర్మారెడ్డిని హెచ్చరించి ఉండవచ్చు. 

చల్లా ధర్మారెడ్డి సోమవారం పరకాలలో మీడియాతో మాట్లాడుతూ, “ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి వివరించే క్రమంలో నేను మాట్లాడిన మాటలను వక్రీకరించి నాపై బురదజల్లాలని ప్రయత్నిస్తున్నారు. నాకు ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యం లేదు. కానీ ఒకవేళ నా మాటలతో ఎవరైనా బాధపడితే క్షమించమని కోరుతున్నాను,” అని అన్నారు. 



Related Post