బడ్జెట్‌లో సామాన్యులకు వరాలు కాదు...వాతలు!

February 01, 2021


img

ఈసారి బడ్జెట్‌ ‘నెవర్ బిఫోర్’ (ఇదివరకు ఎన్నడూ చూడని)విదంగా ఉండబోతోందని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న అన్నారు. ఈరోజు ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూసిన తరువాత అందరూ ఆమెతో ఏకీభవిస్తున్నారు. అయితే ఏదో అద్భుతంగా ఉందని కాదు...ఆదాయం కోసం సామాన్యుల నడ్డి విరిచినందుకు. ఇప్పటికే రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. రోజూ పెరుగుతున్న ధరలు సరిపోవన్నట్లు అగ్రిసెస్ పేరిట పెట్రోల్‌పై లీటరుకు రూ.2.50, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున సుంకం విధిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

ఇక మద్యతరగతి ప్రజలు, ముఖ్యంగా వేతనజీవులు ఎప్పటిలాగే ఆదాయపన్ను శ్లాబ్ పెంపు, పన్నులో రాయితీలు లభిస్తాయని ఆత్రంగా ఎదురుచూశారు. కానీ వాటిలో ఎటువంటి మార్పు లేదని ఒక్కమాటతో తేల్చిచెప్పేశారు. అయితే 75 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఐ‌టి రిటర్న్స్ దాఖలు నుంచి మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు. 

మద్యంపై 100 శాతం, బంగారం, ముడి పామాయిల్‌పై 17.5శాతం, సోయాబీన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20 శాతం అగ్రిసెస్ విధించారు. కనుక సామాన్యులు ఎక్కువగా వినియోగించే పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ ధరలు ఆ మేరకు పెరుగనున్నాయి. 

ఈసారి కూడా బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి చూపి త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలపై వేలకోట్ల వరాలు కురిపించారు.   

 సుమారు 10 నెలలపాటు కరోనా...లాక్‌డౌన్‌లతో అల్లాడిపోయిన సామాన్య ప్రజలకు నిర్మలమ్మ ఈసారి బడ్జెట్‌లో అనేక వరాలు కురిపిస్తుందనుకొంటె కొర్రుకాల్చి వాతాలు పెట్టింది. అప్పుడే మీడియా, మేధావులు, రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాలు నిర్మలమ్మ బడ్జెట్‌పై పెదవి విరుస్తున్నారు. ఆదాయం ఎక్కడి నుంచి ఎంత వస్తుందో చూపకుండా లక్షల కోట్లతో భారీగా పధకాలు ప్రకటించడం, అభివృద్ధిపనులకు నిధులు కేటాయించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Related Post