కరోనా బారినపడిన భారతీయ రైల్వే...కాపాడేదెవరు?

January 30, 2021


img

కరోనా...లాక్‌డౌన్‌ ఆంక్షలు, భయాల కారణంగా దేశంలో పలు సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. వాటిలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సంస్థ కూడా ఒకటి కావడం పెద్ద ఆశ్చర్యకరం కాదు. ఒక్కనగరానికే పరిమితమైన హైదరాబాద్‌ మెట్రో ఆర్ధిక సమస్యల నుండి బయటపడేందుకు ఆపసోపాలు పడుతుంటే, దేశవ్యాప్తంగా రోజూ వేలాది రైళ్ళతో లక్షలాది ప్రయాణికులతో నడిచే భారతీయ రైల్వే ఆర్ధిక పరిస్థితి ఏవిదంగా ఉందో ఊహకు అందదు. 

గత ఏడాది మార్చి నుండి మూలపడిన వేలాది రైళ్ళు నేటికీ పట్టాలు ఎక్కలేదు. ఇంకా ఎప్పటికీ పూర్తిస్థాయిలో నడుస్తాయో తెలీదు. అసలు దీనికి సంబందించి రైల్వేఅధికారులు కానీ కేంద్రప్రభుత్వం గానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడూ లేని హైస్పీడ్ రైళ్ళు, బుల్లెట్ రైళ్ళ గురించి కేంద్రప్రభుత్వం మాట్లాడుతోంది తప్ప ఉన్న రైళ్ళను ఎప్పటి నుంచి నడిపిస్తుందో చెప్పడం లేదు!  

కేంద్రం, రైల్వేశాఖల తీరు చూస్తుంటే కరోనా సాకుతో రైల్వే వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని ఆలోచిస్తున్నాయేమోననే సందేహం కలుగుతోంది. ఎందుకంటే సామాన్య ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్ళను క్రమంగా తగ్గించివేస్తోంది. ఆదాయం పెంచుకోవడం కోసం వాటిలో కొన్నిటిని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళుగా మార్చేస్తోంది. మరోపక్క మరిన్ని ప్రైవేట్ రైళ్ళు నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆదాయం లేదంటూ చిన్న చిన్న రైల్వేస్టేషన్లను మూసివేయిస్తోంది.

రైల్వేశాఖలో వివిద విభాగాలలో ఇప్పటికే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో నింపేసింది. నెలలతరబడి రైళ్ళు నడపకపకతే లక్షలాదిమంది ఉద్యోగుల పరిస్థితి ఏమిటి?వారిని క్రమంగా వదిలించుకోబోతోందా?అనే సందేహం కలుగుతోంది. ఈ పరిణామాలపై రైల్వే ఉద్యోగసంఘాలు ఏమనుకొంటున్నాయో తెలీదు...వీటితో తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని గ్రహించినా ఎందుకు మౌనంగా ఉన్నాయో తెలీదు. యావత్ ప్రపంచలోకే అతిపెద్దదిగా చెప్పుకోబడుతున్న భారతీయ రైల్వేని కంటికి కనబడని కరోనా వైరస్ మింగేస్తోందా లేక కేంద్రప్రభుత్వమే నిర్వీర్యం చేసేస్తోందా?అనే ప్రశ్నకు ఎవరు సమాధానం చెపుతారు? 


Related Post