హైదరాబాద్‌ మెట్రో ఇంకా ఎప్పటికీ కోలుకొంటుందో?

January 30, 2021


img

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ సేవలు 2017, నవంబర్‌ 29 నుండి ప్రారంభం అయ్యాయి. మెట్రో రైల్‌ నగరం నలువైపులకు విస్తరించడంతో హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రో ఎంతో ఉపయోగకరంగా...సౌకర్యవంతమైన ప్రయాణసాధనంగా మారింది. దాంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరుగుతూ 2019 మార్చినాటికి రోజుకు 4 లక్షలకు చేరింది. లాభాలబాటలో నడుస్తున్న హైదరాబాద్‌ మెట్రోకు ఇక తిరుగేలేదనుకొంటున్న సమయంలో హటాత్తుగా కరోనా మహమ్మారి మెట్రోకు సడన్ బ్రేకులు వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మెట్రో రైళ్ళన్నీ సుమారు 5 నెలలు డిపోలకే పరిమితమయ్యాయి. 

రైళ్ళు నడిచినా నడవకున్నా ఉద్యోగుల జీతభత్యాలు, రైళ్ళు, స్టేషన్ల నిర్వహణ తప్పవు కనుక హైదరాబాద్‌ మెట్రో తీవ్రంగా నష్టపోయింది. ఎట్టకేలకు సుమారు 5 నెలల తరువాత గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ నుండి మళ్ళీ మెట్రో రైల్‌ సేవలు పునఃప్రారంభం అయ్యాయి. కానీ కరోనా భయాలతో ప్రయాణికులు తగ్గిపోయారు. మెట్రో రైల్‌ సేవలు ప్రారంభమయ్యి ఇప్పటికి 4 నెలలుపైనే అవుతున్నా నేటికీ మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజుకు 1.70 నుంచి 2 లక్షలకు మించడం లేదు. అంటే 50 శాతం ప్రయాణికులను...ఆ మేరకు ఆదాయాన్ని రోజూ కోల్పోతోందన్నమాట! 

లాభాల మాట దేవుడెరుగు...ఆ వచ్చే ఆదాయం మెట్రో నిర్వహణకు కూడా సరిపోకపోవడంతో ఎల్&టి సంస్థ రోజుకు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలాలు, షాపింగ్ మాల్స్ వంటివి నిర్మించి నిర్వహించడం ద్వారా ఆదాయం సమకూర్చుకొనే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్ఎంఆర్) కూడా లాక్‌డౌన్‌తో నష్టాలలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. 

ఇప్పుడిప్పుడే నగరంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టి ఇటీవలే కరోనా వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చినప్పటికీ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరిగితే తప్ప రెండూ కోలుకోలేవు. కనుక ఈ సమస్యల నుండి బయటపడేందుకు ఎల్&టి, హెచ్ఎంఆర్ సంస్థలు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాల కోసం ఆన్వేషిస్తున్నాయి. 

మెట్రో ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలో వాటికి అప్పగించిన ప్రధానమైన స్థలాలలో భారీ షాపింగ్ మాల్స్ నిర్మించవలసి ఉండగా, ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదని భావించి ఆ ప్రాంతాలలో పెద్దపెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లను కట్టి అద్దెలకు ఇవ్వడం ద్వారా తక్కువఖర్చుతో ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను నిత్యం రద్దీగా ఉండే మాధాపూర్, జూబ్లీహిల్స్, కావూరి హిల్స్ వద్ద ముందుగా ప్రయోగాత్మకంగా షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించడానికి సిద్దంఅవుతున్నట్లు సమాచారం. 


Related Post