రాజకీయ చదరంగంలో పావులుగా పసుపు రైతులు

January 30, 2021


img

నిజామాబాద్‌ జిల్లాలోని పసుపు రైతులు తమ సమస్యల పరిష్కారానికి అనేకసార్లు పోరాటాలు చేశారు. వాటితో వారి సమస్యలు పరిష్కారం కాలేదు కానీ వాటిని రాజకీయపార్టీలు తమకు అనుకూలంగా మలుచుకొని లబ్దిపొందాలని తహతహలాడుతున్నాయి. 

నిజామాబాద్‌ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తమకు న్యాయం చేయలేదనే అక్కసుతో రగిలిపోతున్న పసుపురైతులను ఆకట్టుకొని ధర్మపురి అర్వింద్‌ ఎంపీగా గెలిచారు. కానీ ఆయన కూడా వారి సమస్యలను పరిష్కరించలేకపోయారు. రైతులు పసుపుబోర్డు ఏర్పాటుచేయించి మద్దతుధర ఇప్పించాలని కోరితే ధర్మపురి అరవింద్‌ స్పైసస్ బోర్డు ఏర్పాటు చేయించారు. మద్దతుధర కల్పించలేకపోయారు. ఇదే విషయమై వారు నేరుగా ధర్మపురి అరవింద్‌ను నిలదీశారు. కానీ ఆయన సంతృప్తికరమైన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. దాంతో పసుపు రైతులు గత కొన్ని రోజులుగా ఐక్యకార్యాచరణ సమితి అధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో పసుపుకు కనీస మద్దతుధర ప్రకటించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారు. 

టిఆర్ఎస్‌, బిజెపిల వంతు అయిపోయినందున ఈసారి కాంగ్రెస్ పార్టీ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ ముందుకు వస్తోంది. వారికి మద్దతుగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో నేడు ఒక్కరోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఈ దీక్షలో పాల్గొనబోతున్నారు. 

ఏదో ఓ రాజకీయపార్టీ అండలేనిదే పసుపు రైతులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడలేరు కనుక మొదట టిఆర్ఎస్‌ను... దానిని కాదని బిజెపిని... దానిని కాదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తుంటే అవి తమ రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు ఆడుకొంటున్న రాజకీయచదరంగంలో పావులుగా మిగిలిపోతున్నారు తప్ప వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. 


Related Post