ఉద్యోగులు సిఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు.. తధ్యం?

January 28, 2021


img

బిశ్వాల్ కమిటీ సమర్పించిన వేతనసవరణ నివేదికపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాద్యాయసంఘాలు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ అధ్యక్షతన బీఆర్‌కె భవన్‌లో చర్చలు జరుగుతుండగానే జిల్లా స్థాయిలో ఉద్యోగ, ఉపాద్యాయసంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ సమస్యపై సిఎం కేసీఆర్‌ ఏవిధంగా స్పందిస్తారని ప్రశ్నించుకొంటే గత అనుభవాల నుంచి సమాధానాలు లభిస్తాయి. 

ఇటువంటి సందర్భాలలో ఉద్యోగులు, వారికి మద్దతుగా ప్రతిపక్షాలు ఎన్ని నిరసనలు, ఆందోళనలు చేసినా సిఎం కేసీఆర్‌ మొదట స్పందించకపోవచ్చు. వారి ఆందోళనలు పతాకస్థాయికి చేరుకొన్న తరువాత సిఎం కేసీఆర్‌ ఉద్యోగ, ఉపాద్యాయసంఘాలను ప్రగతి భవన్‌లో విందుభోజనానికి ఆహ్వానించవచ్చు. ఆ తరువాత వారితో సమావేశమయ్యి వారు కోరుకొన్నట్లే 45 శాతం ఇవ్వొచ్చు...లేదా అదనంగా మరో ఒక శాతం కలిపి 46 శాతం ఇచ్చి వారిచేతే జేజేలు పలికించుకొన్నా ఆశ్చర్యం లేదు. గతంలో కూడా పలుసార్లు ఇదేవిధంగా చేశారు కనుక ఇప్పుడూ అదేవిదంగా జరిగే అవకాశం ఉంది. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ అంత పీఆర్సీ ఇవ్వదలచుకోకపోతే ఆర్టీసీ కార్మికులతో వ్యవహరించినట్లు కటినంగా వ్యవహరించి చివరికి వారు అలసిపోయిన తరువాత హటాత్తుగా విందుభోజనానికి ఆహ్వానించి, 7.5కు బదులు 10-12 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి వారిని సంతృప్తిపరిచి వారితోనే జేజేలు పలికించుకోవచ్చు. తద్వారా ఉద్యోగులకు మద్దతుగా ప్రతిపక్షాలు చేసిన పోరాటాలకు ఎటువంటి విలువలేకుండా చేయవచ్చు. గతంలో ఆర్టీసీ కార్మికుల 55 రోజుల నిరవదిక సమ్మె చేసి అలసిపోయినప్పుడు సిఎం కేసీఆర్‌ హటాత్తుగా ఏవిదంగా ముగింపు పలికించారో గుర్తు చేసుకొంటే, ఇప్పుడూ అదేవిదంగా జరిగే అవకాశం ఉందని అర్దమవుతుంది. 

ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించినప్పటికీ చివరికి ఇప్పుడు తనను తిట్టిపోస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయసంఘాల చేతే సిఎం కేసీఆర్‌ పాలాభిషేకాలు చేయించుకోవడం తధ్యం. అయితే అది ఎప్పుడు...ఏవిదంగా...అనేది రానున్న రోజులలో తెలుస్తుంది.


Related Post