పరిస్థితి అర్ధం చేసుకోండి ప్లీజ్: సోమేష్ కుమార్‌

January 28, 2021


img

బిశ్వాల్ కమిటీ ఇచ్చిన వేతన సవరణ నివేదికపై బుదవారం సాయంత్రం బీఆర్‌కె భవన్‌లో ఉద్యోగసంఘాల నేతలతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ నేతృత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. 

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రం సుమారు రూ.52,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని, ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతునందున ఉద్యోగులు పరిస్థితులను అర్ధం చేసుకొని వేతన సవరణల విషయంలో పంతాలకు పోకుండా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇప్పుడు ప్రకటించిన 7.5 శాతం ఫిట్‌మెంట్‌కే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,000 కోట్లకుపైగా ఆర్ధికభారం పడుతుందని కనుక ప్రస్తుత పరిస్థితులలో 63 శాతం ఫిట్‌మెంట్‌ కోరడం సబబు కాదన్నారు. అయితే త్రిసభ్య కమిటీ చెప్పిన మాటలు, చేసిన విజ్ఞప్తులపై ఉద్యోగసంఘాల నేతలు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఈరోజు ఉదయం 10.30 గంటలకు పీఆర్టీయూ సంఘం నేతలతో త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. తరువాత 11.30 గంటలకు యుటీఎఫ్ సంఘం నేతలతో, ఆ తరువాత  మధ్యాహ్నం 12 గంటలకు రెవెన్యూ అసోసియేషన్ నేతలతో వరుసగా సమావేశమై వారికి కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారు. 

కానీ 7.5శాతం ఫిట్‌మెంట్‌కు ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోమని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ముఖాముఖీ మాట్లాడి పరిష్కరించుకొంటామని చెపుతున్నారు. 

సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్‌ నేతలు తెలంగాణ ధనికరాష్ట్రమని...దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రమని పదేపదే చెప్పుకోవడం అందరూ విన్నారు. అలాగే వందల కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తోంది. ఎమ్మెల్యేలకు  హైదరాబాద్‌లో విలాసవంతమైన క్వార్టర్స్, క్యాంప్ కార్యాలయాలు ప్రభుత్వం నిర్మిస్తోంది. కానీ తమకు వేతనసవరణ చేయాల్సివచ్చేసరికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో సర్దుకుపోవాలని చెపుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చివరికి ఈ సంస్య ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో ఏవిధంగా ముగుస్తుందో చూడాలి.


Related Post