బిశ్వాల్ కమిటీ సమర్పించిన వేతన సవరణ నివేదికలో 7.5 శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేయడంపై రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్ వద్ద నిరసనలు మొదలుపెట్టాయి. తెలంగాణ ఏర్పడిన మొట్టమొదటి అధికారిక పీఆర్సీలో కేవలం7.5 శాతం ఫిట్‌మెంట్ సిఫార్సు చేయడం తమను మోసం చేయడమేనని ఆందోళన చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీఆర్సీ నివేదిక ప్రతులను చించివేసి ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పీఆర్సీని మార్చివేశారని ఆరోపించారు. అసలు తమ వేతనాలు తగ్గించడానికి బిశ్వాల్ ఎవరని వారు ప్రశ్నించారు. ఈ పీఆర్సీ తమకు ఆమోదయోగ్యం కాదని కనుక ఎట్టి పరిస్థితులలో అంగీకరించబోమని స్పష్టం చేశారు. సిఎం కేసీఆర్ తక్షణం జోక్యం చేసుకొని దీనిపై స్వయంగా వివరణ ఇవ్వాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో పీఆర్సీ నివేదికపై చర్చించడానికి త్రిసభ్య కమిటీ ఎదురుచూస్తుంటే బీఆర్‌కె భవన్ ఎదుట వారు ధర్నాకు దిగడంతో ప్రభుత్వం షాక్ అయ్యింది.