పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలలో సెగలు

January 27, 2021


img

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు 7.5శాతం  ఫిట్‌మెంట్, కనీస వేతనం నెలకు రూ.19,000 ఇవ్వాలని, హెచ్ఆర్ఏ తగ్గించాలనే పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. గత రెండున్నరేళ్ళుగా దీనికోసం చాలా ఆశగా ఎదురుచూశామని, కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవలసిరావడం చూసి తాము ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తమ జీతాలలో కొత్త విధించినా ఎవరూ అభ్యంతరం చెప్పకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించామని అన్నారు. కానీ బిశ్వాల్ కమిటీ తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం 7.5శాతం   ఫిట్‌మెంట్ సిఫార్సు చేయడం సరికాదన్నారు. కనీస వేతనం, హెచ్ఆర్ఏ తగ్గింపులపై కూడా వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఉద్యోగసంఘాల ప్రతినిధులు అన్నారు. ఇవాళ్ళ సాయంత్రం ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ అధ్యక్షతన త్రిసభ్యకమిటీతో చర్చలకు కూర్చోన్నప్పుడు తమ అభ్యంతరాలను, డిమాండ్లను తెలియజేస్తామని అన్నారు. 

అయితే బిశ్వాల్ కమిటీ 7.5 శాతం ఫిట్‌మెంట్ సిఫార్స్ చేసినప్పుడు ఎంత చర్చించినా అది మహా అయితే 10 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించవచ్చునేమో కానీ గతంలోలాగా భారీగా ఇచ్చే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఒకవేళ అదే జరిగితే, అప్పుడు ప్రభుత్వోద్యోగులు ఏవిధంగా స్పందిస్తారో...త్వరలో రాష్ట్రంలో వరుస ఎన్నికలు జరుగనున్నందున ఈ పీఆర్సీ ప్రభావం వాటిపై కూడా పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ సమస్యను సిఎం కేసీఆర్‌ ఏవిధంగా పరిష్కరిస్తారో చూడాలి. 


Related Post