నేడు శశికళ విడుదల... అన్నాడీఎంకెలో ఆందోళన

January 27, 2021


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు నేటితో నాలుగేళ్ళ జైలు శిక్ష పూర్తవుతున్నందున ఇవాళ్ళ ఆమె విడుదలకానున్నారు. కానీ నాలుగైదు రోజుల క్రితం ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో జైలు అధికారులు ఆమెను బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కనుక అక్కడే విడుదలకు సంబందించి పత్రాలపై సంతకాలు తీసుకొని ఆమెను విడుదల చేయనున్నారు. 

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవలసి ఉందని వైద్యులు సూచించారు. కనుక ఆమె అదే ఆసుపత్రిలో ఉండి చికిత్స కొనసాగిస్తారా లేదా మెరుగైన చికిత్స కోసం బెంగళూరు లేదా చెన్నైలోని కార్పొరేట్ ఆసుపత్రికి మారుతారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. 

ఆమె మేనల్లుడు దినకరన్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడులోని అధికార అన్నాడీఎంకె నేతలలో కలవరం పుట్టిస్తున్నాయి. మొన్న శశికళను పరామర్శించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “అన్నాడీఎంకె పార్టీలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. నలుగురు మంత్రులు శశికళకు మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. ఆమె చెన్నై చేరుకొంటే భారీగా స్వాగతం పలికేందుకు పలువురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. వారిలో ఎమ్మెల్యే వెంకటాచలం అందుకు అన్ని ఏర్పాట్లు చేసి రూ.50 లక్షలు ఖరీదు చేసే వెండి ఖడ్గాన్ని తయారుచేయించి ఆమెకు బహుకరించేందుకు ఎదురుచూస్తున్నారు. శశికళ కోలుకొని చెన్నై చేరుకోగానే ఆమె వెంట నడిచేందుకు పలువురు అన్నాడీఎంకె నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉన్నారు,” అని దినకరన్ అన్నారు. 

అంటే శశికళ చెన్నై చేరుకోగానే మొట్టమొదట చేసేపని అన్నాడీఎంకె ప్రభుత్వాన్ని కూల్చివేసి, ఆ పార్టీని నిలువునా చీల్చడమే అని విస్పష్టంగానే చెప్పినట్లఅయ్యింది కనుక ముఖ్యమంత్రి పళనిస్వామితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆమె నుండి తమ ప్రభుత్వాన్ని, పార్టీని ఏవిధంగా కాపాడుకోవాలని సమాలోచనలు చేస్తున్నారు.


Related Post