అవును...మా ర్యాలీలో అసాంఘికశక్తులు ప్రవేశించాయి: ఢిల్లీ రైతు సంఘాలు

January 26, 2021


img

‘కిసాన్ రిపబ్లిక్ డే పరేడ్’ పేరిట ఇవాళ్ళ ఢిల్లీలో ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహించిన రైతులు విధ్వంసం సృష్టించారు. ర్యాలీ సందర్భంగా కొందరు రైతులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. పోలీసులను ట్రాక్టర్లతో తొక్కించి చంపేసేందుకు ప్రయత్నించారు. పోలీసులపై రాళ్ళు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. పెద్దపెద్ద తల్వార్లు (కత్తులు) చేతబూని గుర్రాలపై తరలివచ్చిన కొందరు వాటితో పోలీసులపై దాడికి ప్రయత్నించారు. రైతుల ముసుగులో ఢిల్లీలో ప్రవేశించిన అరాచకమూకాలు ఎంతకు తెగించాయంటే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధానమంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే స్తంభంపై తమ జెండాను ఎగురవేసారు. 



మధ్యాహ్నం 12 నుండి నిర్దేశ్యించిన మార్గాలలో పరిమిత సంఖ్యలో ర్యాలీ నిర్వహించుకోవడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించగా, వేలాదిమంది రైతులు… ఉదయం 8 గంటల నుండే ట్రాక్టర్లు, కార్లు, బైకులపై ఢిల్లీలో ప్రవేశించి, ఓ పధకం ప్రకారం వేర్వేరు మార్గాలలో ప్రయాణిస్తూ ఎక్కడికక్కడ అరాచకం సృష్టించారు. వారి విధ్వంసానికి భయపడి ఢిల్లీలో మెట్రో స్టేషన్లను మూసివేసి మెట్రో రైళ్లను నిలిపివేయవలసి వచ్చింది. అల్లరిమూకలు పరస్పరం సమాచారం పంపుకొని విధ్వంసం సృష్టిస్తుండటంతో ఇంటర్నెట్ నిలిపివేయవలసి వచ్చింది. సిటీ బస్సులను నిలిపివేయవలసి వచ్చింది. 

ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించిన కేంద్రహోంమంత్రి అమిత్ షా తక్షణం 15 కంపెనీల పారా మిలటరీ దళాలను ఢిల్లీలో మోహరించి రైతుల ముసుగులో రెచ్చిపోతున్న అరాచకశక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు.

ఈ రోజు ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్ మోర్చా నేతలు కూడా ఖండించారు. తమ ర్యాలీలో అసాంఘికశక్తులు, అల్లరిమూకలు జొరబడి విధ్వంసం సృష్టించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఇంతవరకు శాంతియుతంగా చేస్తున్న తమ ఆందోళనలకు చాలా చెడ్డ పేరు వచ్చిందని రైతు సంఘాల ఐక్యవేదిక నాయకుడు రాకేశ్ తికాయత్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికే కొన్ని అసాంఘికశక్తులు ఈ విధ్వంసం సృష్టించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దేశ గౌరవానికి అప్రదిష్ట కలిగించే పనులు తామెన్నడూ చేయబోమని అన్నారు. ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు విచారం వ్యక్తం చేశారు. మళ్ళీ ఇటువంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటామని, శాంతియుతంగా ఆందోళనలు కొనసాగిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు చెప్పారు.


Related Post