కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నిక...ఎప్పుడూ తిప్పలే

January 26, 2021


img

కాంగ్రెస్ పార్టీలో జాతీయస్థాయిలో కావచ్చు...రాష్ట్ర స్థాయిలో కావచ్చు...అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు జరపాల్సి వచ్చినా డైలీ సీరియల్లాగ నెలల తరబడి సాగుతూనే ఉంటుంది. జాతీయస్థాయిలో సోనియా, రాహుల్ గాంధీలు తప్ప వేరెవరూ ఆ పదవి చేపట్టరాదనే అప్రకటిత నిబందన ఉన్నందున, వారిరువురిలో ఎవరో ఒకరు ఆ పదవిలో ఉండాల్సిందే. కనుక ఎన్నిక ఎప్పుడూ లాంఛనప్రాయమే. 

పార్టీలో కొందరు సీనియర్లు ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ వారిని సోనియా, రాహుల్ గాంధీల విధేయవర్గం ఏదో ఓ సాకుతో వెంటనే అడ్డుకొంటుంది. ఇప్పుడూ అదే జరిగింది. పార్టీ అధ్యక్ష ఎన్నికపై ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుమారు 3 గంటలపాటు ఏకధాటిగా చర్చించారు. తక్షణమే అధ్యక్ష ఎన్నికలు జరపాలని గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, చిదంబరం, ముకుల్ వాస్నిక్ తదితర సీనియర్లు పట్టుబట్టారు. వెంటనే సోనియా, రాహుల్ గాంధీల విధేయులుగా చెప్పుకోబడే ఏకే ఆంటోనీ, అమరీందర్ సింగ్, ఉమెన్ చాందీ, అశోక్ గెహ్లాట్, తారీక్ అన్వర్ తదితరులు వారిని అడ్డుకున్నారు. త్వరలో 5 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున అవి పూర్తయిన తరువాత పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరపాలని వారు గట్టిగా పట్టుబట్టారు. వారు బహుశః సోనియా, రాహుల్ గాంధీల మనసులో మాటనే చెప్పి ఉంటారు కనుక రాహుల్ గాంధీ మద్యలో కలుగజేసుకొని శాసనసభ ఎన్నికల తరువాతే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించుకొందామని తేల్చిచెప్పేసి సీనియర్ల నోళ్ళకు తాళం వేసేశారు. దాంతో అధ్యక్షుడి ఎంపిక మరో ఆరు నెలలు వాయిదావేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిచేతులు దులుపుకొంది.  

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ముందు ఇలాగే చాలా రోజులు డ్రామా నడవడం చివరికి నాగార్జునసాగర్ ఉపఎన్నికలు పూర్తయిన తరువాత ఆలోచిద్దామని వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కనుక కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే సులువని భావించవచ్చునేమో?


Related Post