ట్రాక్టర్ ర్యాలీతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

January 26, 2021


img

ఊహించినట్లుగానే రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత మూడు నెలలుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘కిసాన్ రిపబ్లిక్ డే పెరేడ్’ పేరిట నేడు ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసుల అనుమతి పొందారు. అయితే 38 షరతులతో మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల వరకు 5,000 ట్రాక్టర్లతో... కొన్ని నిర్దేశించిన మార్గాలలో మాత్రమే ర్యాలీ నిర్వహించుకోవడానికి ఢిల్లీ పోలీసులు అనుమతించారు. కానీ ఈరోజు ఉదయం 8 గంటల నుండే పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుండి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలో ప్రవేశించడం మొదలుపెట్టారు. వారిని అడ్డుకొనేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నించినప్పటికీ అంతమందిని నిలువరించలేకపోయారు.

వారు నగరంలో ప్రవేశించకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు, భారీ కంటెయినర్ వాహనాలను అడ్డుగా పెట్టినప్పటికీ రైతులు తమ ట్రాక్టర్లతో వాటిని పక్కకు జరిపి యాదేచ్చగా ఢిల్లీలోకి ప్రవేశించడం మొదలుపెట్టారు. దాంతో ఢిల్లీ పోలీసులు వారిపై కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేశారు. వారిని ముందుకు రాకుండా అడ్డుకొనేందుకు కొన్ని చోట్ల బాష్పవాయువు, వాటర్ కెనాన్లు కూడా వినియోగించారు. కానీ వేలాదిగా తరలివస్తున్న రైతులను ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేకపోతున్నారు. 

రైతులలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన సర్దార్జీలు ఎక్కువగా ఉండటంతో వారు కత్తులను, కర్రలను వెంటపెట్టుకొని ర్యాలీకి వచ్చారు. వారిలో కొందరు గుర్రాలపై కత్తులు పట్టుకొని ముందుకు సాగుతూ అడ్డువచ్చిన పోలీసులపై దాడులకు ప్రయత్నించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. 

ట్రాక్టర్లతో ర్యాలీకి వస్తున్న వేలాదిమంది రైతులను కట్టడి చేయడమే చాలా కష్టంగా మారింది. వారిలో పాకిస్థాన్‌ ఉగ్రవాదులు కూడా కలిసిపోయి ఢిల్లీలో ప్రవేశించి విధ్వంసానికి పాల్పడవచ్చని నిఘావర్గాలు పదేపదే హెచ్చరికలు చేసింది. కనుక ఈ ర్యాలీ ముగిసేలోగా ఢిల్లీలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి.


Related Post