మూఢనమ్మకాలతో ఇద్దరు కుమార్తెలను హత్యచేసిన కన్నతల్లి

January 25, 2021


img

సాంకేతిక విప్లవంతో ఎంతగానో అభివృద్ధి సాధించిన ఈరోజుల్లో కూడా ఇంకా కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలను నమ్ముతూనే ఉన్నారు. నిరక్షరాస్యులు, లోకజ్ఞానం లేనివారు మూడనమ్మకాలను నమ్మితే అర్ధం చేసుకోవచ్చు కానీ ఉన్నత విద్యావంతులు, అధ్యాపకులు పనిచేస్తున్నవారు కూడా మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడమే చాలా విస్మయం కలిగిస్తుంది. 

 తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో అటువంటి అత్యంత దారుణం జరిగింది. మల్లూరు పురుషోత్తం నాయుడు స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వైస్‌-ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పద్మజ  గణిత శాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్...మదనపల్లిలో ఓ ప్రైవేట్ కళాశాల కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వారికి అలేఖ్య (27), సాయి దివ్య (23) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో అలేఖ్య మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ అటవీశాఖలో ఉద్యోగం చేస్తుండేది. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మదనపల్లిలో తల్లితండ్రుల ఉంటూ చదువుకొంటోంది. రెండో కుమార్తె సాయిదివ్య ఎంబీఏ పూర్తిచేసి చెన్నైలోని ఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ మ్యూజిక్‌లో సంగీతం నేర్చుకొంటోంది. కరోనా కారణంగా ఆమె కూడా కొంత కాలం క్రితం మదనపల్లిలో తల్లితండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. తల్లితండ్రులు, పిల్లలు అందరూ మంచి ఉన్నత విద్యావంతులు...చాలా దైవభక్తి కలిగినవారు. అందరితో చాలా  చాలా కలివిడిగా...ఎంతో సంస్కారవంతంగా వ్యవహరించేవారు. ఏవిధంగా చూసిన వారిది చాలా చూడముచ్చటైన చక్కటి కుటుంబం...కానీ మనోవైకల్యంతో అది ఒక్కసారిగా ఛిద్రమైపోయింది. 

పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు గత కొన్నిరోజులుగా ఉద్యోగాలకు శలవు పెట్టి కరోనాను అంతమొందించేందుకు ఇంట్లో క్షుద్రపూజలు చేయిస్తున్నారు. నిన్న..అంటే ఆదివారం రాత్రి తల్లి, ఇద్దరు కూతుళ్ళు నగ్నంగా ఇంట్లో క్షుద్రపూజలు చేసిన తరువాత ముగ్గురూ ఇంటి చుట్టూ నగ్నంగా ప్రదక్షిణాలు చేశారు. అనంతరం పద్మజ తన పెద్ద కూతురి నుదుటపై డంబెల్స్ తో కొట్టి చంపేసింది! క్షుద్రదేవతకు బలి ఇచ్చిన పెద్ద కూతురును మళ్ళీ బ్రతికించుకోవడానికి రెండో కూతురును బలి ఇవ్వాల్సి ఉంటుందని నమ్మిన పద్మజ సాయిదివ్యను మొదటి అంతస్తులోకి తీసుకువెళ్లి ఆమెను కూడా శూలంతో పొడిచి చంపేసింది! అనంతరం ఆమె నోట్లో చిన్న రాగిచెంబు పెట్టి నుదుట కుంకుమ పెట్టింది! 

తల్లీకూతుళ్ళు నగ్నంగా ఇంటి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చూసిన పొరుగింట్లో వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేయడంతో వారు వెంటనే అక్కడకు చేరుకొన్నారు. పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు కానీ సమయానికి పోలీసులు రావడంతో వారిని అడ్డుకొని ఆసుపత్రికి తరలించారు. “మా ఇంట్లో దివ్యశక్తులను ప్రతిష్టించాము...అవి మా పిల్లలను మళ్ళీ బ్రతికించి ఈ లోకాన్ని కరోనా బారి నుండి కాపాడుతాయని వారు పోలీసులకు చెప్పారు. ఇటువంటి ఘోరమైన... విషాదకరమైన ఘటనల గురించి ఇంతకంటే చెప్పాల్సింది ఏముంటుంది?


Related Post