నన్ను క్షమించండి: టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే

January 23, 2021


img

అయోధ్య రామమందిరం కోసం బిజెపి నేతలు విరాళాలు సేకరిస్తుండటంపై అనుచితంగా మాట్లాడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కోరుట్ల టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, వెనక్కు తగ్గి క్షమాపణలు చెప్పారు. మెట్‌పల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “నేను కూడా శ్రీరామభక్తుడనే. నిత్యం పూజలు చేస్తుంటాను. జిల్లాలో అనేక ఆలయాలు కట్టించాను కూడా. అయితే అయోధ్య రామాలయం పేరిట బిజెపి నాయకులు విరాళాలు సేకరిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్నట్లు భావించి నేను వారికి విరాళాలు ఇవ్వొద్దని అన్నానే తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు. ఒకవేళ వారు నాదగ్గరకు వచ్చి ఉంటే నేను చాలా సంతోషించి భారీగా విరాళం ఇచ్చేవాడిని. అయితే వారు ప్రజలందరి దగ్గరకు వెళ్ళి నన్ను విరాళం అడగకపోవడంతో ఆవేశంలో ఏదో మాట్లాడాను. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెపుతున్నాను. ఈ విషయంలో నేను ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ వివాదంతో సిఎం కేసీఆర్‌కు కానీ మా పార్టీకి, మా ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబందమూ లేదు. శ్రీరాముడు బిజెపి నేతల సొంతం కాదని అందరివాడని గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతీ చిన్న విషయాన్ని సోషల్ మీడియాలోకి ఎక్కించేసి గోరంతను కొండంతగా చూపి ప్రచారం చేసుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తుంటారు. ఇది సరికాదని నా అభిప్రాయం,” అని అన్నారు.

రాష్ట్రంలో క్రమంగా బిజెపి బలపడుతున్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలతో బిజెపి ప్రజలలోకి చొచ్చుకుపోయి వారిని ఆకర్షించేందుకు అవకాశం కల్పించినట్లవుతుంది కనుక టిఆర్ఎస్‌ అధిష్టానం ఆయనను హెచ్చరించి ఉండవచ్చు. ఈ వివాదంపై బిజెపి నేతలు చేస్తున్న ధర్నాలు, దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వంటి కార్యక్రమాలతో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనే కనుక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్షమాపణలు కోరినట్లు భావించవచ్చు.  


Related Post