ఏపీలో నిమ్మగడ్డ-జగన్ పంచాయతీ క్లైమాక్స్

January 23, 2021


img

ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మద్య గత ఏడాదిగా సాగుతున్న పంచాయితీ ఇవాళ్ళ క్లైమాక్స్ చేరుకొంది. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కనుసన్నలలో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని భావిస్తున్న జగన్ సర్కార్, ఆయన పదవీ విరమణ చేసేవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని పట్టుదలగా ఉంది. అయితే హైకోర్టు కూడా ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ ఈరోజు తొలివిడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అయినా జగన్ సర్కార్ తన ప్రయత్నాలు విరమించలేదు. హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. కానీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టేలోగానే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో బహుశః ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కూడా కలుగజేసుకోకపోవచ్చు. కరోనా భయాలు, వాక్సినేషన్ అంటూ జగన్ సర్కార్ చెపుతున్న కారణాలు కుంటిసాకులని అర్ధమవుతూనే ఉంది. కనుక సుప్రీంకోర్టు ఈ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. అదే జరిగితే, జగన్ సర్కార్‌కు ముఖ్యంగా...ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిమ్మగడ్డ చేతిలో ఓడిపోయినట్లే అవుతుంది. 

ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించినందున నేటి నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని నిమ్మగడ్డ తెలిపారు. మొత్తం నాలుగు దశలలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, అయినా ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ ఇవాళ్ళ తేల్చిచెప్పారు. 

మొదటి దశ: జనవరి 25 నుండి 31వరకు నామినేషన్ల ప్రక్రియ. ఫిబ్రవరి 5న పోలింగ్;

రెండో దశ: జనవరి 29 నుండి 31వరకు నామినేషన్ల ప్రక్రియ. ఫిబ్రవరి 9న పోలింగ్;

మూడో దశ: ఫిబ్రవరి 2 నుండి 8 వరకు నామినేషన్ల ప్రక్రియ. ఫిబ్రవరి 13న పోలింగ్;

నాలుగో దశ: ఫిబ్రవరి 6 నుండి 12 వరకు నామినేషన్ల ప్రక్రియ. ఫిబ్రవరి 17న పోలింగ్;

పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని నిమ్మగడ్డ తెలిపారు.


Related Post