ఖమ్మం టిఆర్ఎస్‌ నేతలకు క్లాస్ పీకిన కేటీఆర్‌

January 22, 2021


img

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం ప్రగతి భవన్‌లో ఖమ్మం జిల్లా తెరాస నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యేలు, తెరాస నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ వారితో మాట్లాడుతూ ఏవైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. అందరూ విభేదాలను పక్కన పెట్టి ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్‌ గెలుపు కోసం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. లేకుంటే విభేదాల కారణంగా ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా జిల్లా ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవాలని కేటీఆర్‌ సున్నితంగా హెచ్చరించారు. మీడియాతో మాట్లాడేటప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే సున్నితమైన అంశాల జోలికి వెళ్లకుండా మాట్లాడాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికలలో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అందరూ అందుకు సిద్దం కావాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. 


Related Post