శశికళ విడుదలతో అన్నాడీఎంకె నేతలు బేజారు

January 20, 2021


img

స్వర్గీయ జయలలిత హయాంలో తమిళనాడు రాజకీయాలను శాశించిన శశికళ ఈనెల 27న జైలు నుండి విడుదలకాబోతున్నారు. ఆమె జైలు నుండి విడుదలకాగానే ముందుగా అన్నాడీఎంకె పార్టీని నిలువునా చీల్చి తమ ప్రభుత్వాన్ని కూలద్రోయవచ్చని ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కానీ పైకి మాత్రం అన్నాడీఎంకె నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఆమెను చూసి భయపడాల్సిన అవసరం తమకు లేదని ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోబోమని చెపుతున్నారు. అయితే ఆమె విడుదలకు ముందే తమిళనాడు సిఎం పళనిస్వామి సోమవారం హడావుడిగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో భేటీ అవడం గమనిస్తే ఆ పార్టీ నేతలు లోలోన ఎంత ఆందోళన చెందుతున్నారో అర్ధమవుతోంది. అయితే రాష్ట్రానికి నిధులు, అభివృద్ధి పనుల గురించి మాత్రమే తాము చర్చించామని, రాజకీయ అంశాలపై చర్చించలేదని సిఎం పళనిస్వామి మీడియాకు చెప్పారు.  

శశికళ మేనల్లుడు దినకరన్ స్థాపించిన ఏఎంఎంకె పార్టీ అధికార ప్రతినిధి సరస్వతి మంగళవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “శశికళ జైలు నుండి విడుదల కాగానే అన్నాడీఎంకె పార్టీని స్వాధీనం చేసుకొంటారు. ఆ పార్టీలో పన్నీర్ సెల్వమ్, పళనిస్వామితో సహా అందరూ శశికళ, దినకరన్‌ల దయతోనే పదవులు దక్కించుకున్నారు. కనుక శశికళ జైలు నుండి విడుదలకాగానే అన్నాడీఎంకె పార్టీలో అందరూ ఆమె సారధ్యంలో పనిచేస్తారు,” అని ఆమె అన్నారు.

శశికళను బిజెపిలో చేర్చుకొనేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి తమిళనాడు రాజకీయాలలో ఆమె ఎంత శక్తివంతురాలో అర్ధం చేసుకోవచ్చు. 


Related Post