ఆ మూడు పార్టీలకు దమ్ముంటే... మందకృష్ణ మాదిగ

January 20, 2021


img

మంగళవారం హన్మకొండలో మహాజన సోషలిస్ట్ పార్టీ తొలి రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. దానిలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, “నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో మన పార్టీ పోటీ చేస్తుంది. ఈసారి పోటీ మన పార్టీకి టిఆర్ఎస్‌కు మద్యనే ఉంటుంది. ఈ ఎన్నికలలో మనం తప్పకుండా గెలిచి రాష్ట్రంలో దొరల పాలనకు చరమగీతం పాడుతాము. టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు దమ్ముంటే నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో ఓటర్లకు డబ్బు, మద్యం పంచకుండా పోటీ చేయాలని నేను వాటికి సవాలు విసురుతున్నాను. మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే బడుగుబలహీన వర్గాలకు హక్కులు, రాజ్యాధికారం లభిస్తుంది,” అని అన్నారు. 

దళితుల హక్కుల కోసం పోరాడుతూ మందకృష్ణ మాదిగ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపే సంపాదించుకొన్నారు. కానీ రాజకీయంగా తప్పటడుగులు వేస్తుండటం వలన ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టలేకపోయారని చెప్పక తప్పదు. బహుశః అందుకే మహాజన సోషలిస్ట్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. అయితే టిఆర్ఎస్‌, బిజెపిల ధాటికి కాంగ్రెస్‌ వంటి బలమైన పార్టీయే అల్లాడిపోతుంటే మహాజన సోషలిస్ట్ పార్టీ వాటితో పోటీ పడగలదా? అనే సందేహం కలుగకమానదు. కానీ ప్రయత్నించకుండానే చేతులు ఎత్తేసే బదులు వాటిని ఎదుర్కొని తమ పార్టీ బలం ఎంతో తెలుసుకోవడం మంచిదే.


Related Post