కేసీఆర్‌ పనిచేయలేకపోతే తప్పుకోవాలి: విజయశాంతి

January 19, 2021


img

తెలంగాణ భాజపా ఫైర్ బ్రాండ్ నేత విజయశాంతి మరోసారి సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో భాజపా కార్యాలయంలో పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విజయశాంతి హాజరయ్యారు.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ కొంతమంది తెరాస నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముమ్మాటికీ తెరాసకు భాజపానే గట్టిపోటీనిస్తుందని అన్నారు. దుబ్బాకజిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలే మున్ముందు కూడా పునరావృతం కానున్నాయని అన్నారు.

రాష్ట్రం ఏర్పడ్డాక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి కేసీఆర్‌ మాట తప్పారని, ఆ తరువాత నిరుద్యోగభృతికొత్త వృద్ధాప్య పింఛన్లు వంటి హామీలను కూడా ప్రభుత్వం ఇంతవరకు నెరవేర్చేలేకపోయిందని విజయశాంతి ఆరోపించారు.

సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమై పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం దారుణమన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పి ఉంటే  బాగుండేదని అన్నారు. సిఎం కేసీఆర్‌ వయోభారం చేత పనిచేయలేని స్థితిలో ఉన్నట్లయితే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

 తెలంగాణలో మార్పు రావాలంటే భాజపాతోనే సాధ్యం అని అన్నారు. భాజపా ఒత్తిడితోనే కేసీఆర్‌ తన ప్రభుత్వంలోకి మహిళా మంత్రులకు అవకాశం కల్పించారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండాలని విజయశాంతి ఆకాంక్షించారు.


Related Post