కేటీఆర్‌ సిఎం పాత్ర పోషిస్తున్నారు...తప్పేమిటి? ఈటల

January 19, 2021


img

ఈనెల 16 నుండి రాష్ట్రంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యింది. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలను సిఎం కేసీఆర్‌ ప్రారంభిస్తుంటారు. కానీ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ దానిని ప్రారంభించారు. మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ముఖ్యమంత్రికి బదులు మంత్రి కేటీఆర్‌ హాజరవడం’ పై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.        

“ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు మంత్రి కేటీఆర్‌ ఆ పాత్ర(ముఖ్యమంత్రి) పోషిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీలో 99 శాతం పనులను మంత్రి కేటీఆరే చూస్తుంటారు. అందులో తప్పేముంది?అయినా టీకా కార్యక్రమానికి సిఎం కేసీఆర్‌ హాజరుకాకపోవడాన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు,” అని అన్నారు.   

“త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అవి నిజమని భావించవచ్చా?”అనే మరో ప్రశ్నకు “ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చు. అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చు,” అని మంత్రి ఈటల రాజేందర్‌ జవాబిచ్చారు. 

పార్టీలో, ప్రభుత్వంలో తన పాత్ర పరిమితమైందనే అభిప్రాయం సరికాదన్నారు. పరిస్థితులను బట్టి మాట్లాడటం, మౌనం వహించడం, నిశబ్ధంగా పనిచేసుకుపోతుండటం చేస్తుంటానని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ సందర్భంగా మళ్ళీ ఆయన ‘గులాబీ జెండా యాజమానుల’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఎవరు పార్టీ స్థాపించినా...ఎవరు జెండా తెచ్చినా...అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ నిలబడుతుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి మీదనో ఆధారపడి పార్టీ నడవదు. టిఆర్ఎస్‌లో ప్రతీ ఒక్కరూ ఈ పార్టీ నాది...ఈ జెండా నాది...అని అనుకోకపోతే పార్టీకి...వారికీ కూడా నష్టమే,” అని అన్నారు.


Related Post