బుల్లెట్ రైళ్లు ఓకే... మామూలు రైళ్లు ఇంకా ఎప్పుడు?

January 18, 2021


img

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో బుల్లెట్ రైళ్ళు, హైస్పీడ్ రైళ్ళు, డెడికేటడ్ గూడ్స్ రైల్వే లైన్లు, మెట్రో రైల్వే లైన్ల నిర్మాణ పనులు చాలా చురుకుగా సాగుతున్నాయి. గుజరాత్‌లో రూ.17,404 కోట్లు వ్యయం కాబోయే రెండు మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్రమోడీ నేడు శంఖుస్థాపన చేయడమే అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఇటువంటి కొత్త కొత్త భారీ రైల్వే ప్రాజెక్టులు తీసుకువస్తుండటం చాలా అభినందనీయమే. కానీ సామాన్య ప్రజలకు అత్యవసరమైన ప్యాసింజర్ రైళ్ళను మోడీ ప్రభుత్వం క్రమంగా తగ్గించేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా భయాల పేరుతో దాదాపు 11 నెలలుగా సాధారణ రైళ్ళను నడిపించకుండా నిలిపివేయడంతో సామాన్యప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే కరోనా సాకుతో వాటిని నిలిపివేసిన రైల్వేశాఖ వాటి స్థానంలో ప్రత్యేక రైళ్ళను, ప్రైవేట్ రైళ్లను నడిపిస్తూ సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోంది. సుమారు ఏడాదిగా రైళ్ళు నిలిపివేయడంతో రైల్వేల మనుగడ...దానిలో పనిచేసే లక్షలాదిమంది ఉద్యోగుల భవిష్యత్‌ కూడా ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. 

ఒకప్పుడు గుజరాత్‌లో బస్టాండులో ఛాయ్ అమ్ముకొని బ్రతికేవాడినని గర్వంగా చెప్పుకొనే ప్రధాని నరేంద్రమోడీ నిరుపేద, సామాన్య ప్రజల సంక్షేమం కంటే బడా కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే ఎక్కువ ప్రయత్నిస్తుంటారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. కరోనా సాకుతో దేశంలో సాధారణ రైళ్ళను నిలిపివేసి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసి వాటి స్థానంలో ప్రైవేట్ రైళ్ళను ప్రవేశపెట్టేందుకే మోడీ ప్రభుత్వం ఆలోచిస్తోందా?అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. లేకుంటే ప్రత్యేక రైళ్ళు, ప్రైవేట్ రైళ్ళు, మెట్రో రైళ్ళకు లేని కరోనా భయాలు, ఆంక్షలు సాధారణ రైళ్ళకే ఎందుకు? అనే ప్రశ్న వినిపిస్తోంది.


Related Post