ట్రంప్‌ తీరు మారలేదు...20న గుడ్ బై!

January 16, 2021


img

ఇప్పటివరకు అమెరికాను పాలించిన అధ్యక్షులలో డోనాల్డ్ ట్రంప్‌ అత్యంత అప్రతిష్ట, అవమానాలు మూటగట్టుకొని వెళ్ళిపోబోతున్నారు. అయితే నేటికీ ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు కనబడటం లేదు. అధ్యక్షుడిగా చివరి నిమిషం వరకు ఆయన అలాగే ప్రవర్తిస్తుండటం విస్మయం కలిగిస్తుంది. 

ఈనెల 20వ తేదీన జో బైడెన్‌ అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆనవాయితీ ప్రకారం ట్రంప్‌ ఆయనను సాధారంగా వైట్‌హౌస్‌కి ఆహ్వానించి ఆయన గౌరవార్థం తేనీటి విందు ఇచ్చి వైట్‌హౌస్‌ అప్పగించి నిష్క్రమిస్తే చాలా హుందాగా ఉండేది. కానీ జో బైడెన్‌ ఎన్నికనే అంగీకరించని ట్రంప్‌ ఆయనకు అంతా గౌరవమర్యాదలు ఇస్తారనుకోవడం అత్యాసే అవుతుంది. జనవరి 20న జో బైడెన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా తాను హాజరుకాబోనని ట్రంప్‌ ముందే ప్రకటించేశారు. కనుక ఆయన ప్రమాణస్వీకారం చేస్తున్న సమయానికే డోనాల్డ్ ట్రంప్‌ వైట్‌హౌస్‌ నుంచి వెళ్ళిపోయేందుకు పెట్టెబేడా సర్దుకొంటున్నారు. 

ఆయన ఆనవాయితీలను మర్యాదలను పాటించకపోయినా ఒక దేశాధ్యకుడు నిష్క్రమిస్తున్నప్పుడు ఆయనను సగౌరవంగా సాగనంపవలసి ఉంటుంది కనుక వాషింగ్‌టన్‌ నగర శివార్లలో జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ ప్రధానకార్యాలయం వద్ద ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడి నుండి డోనాల్డ్ ట్రంప్‌ ఫ్లోరిడాలోని పామ్‌బీచ్‌లోని తన ‘మార్ ఏ లాగో క్లబ్’ కు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. 

వాషింగ్‌టన్‌లో క్యాపిటల్ హిల్ భవనంలో ఉభయసభలు సమావేశమవుతున్నప్పుడు ట్రంప్‌ తన మద్దతుదారులను దాడులకు పురిగొల్పినందుకు దిగువ సభలో అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. పదవీకాలం ముగియక మునుపే రాజీనామా చేయవలసిన అవమానకర పరిస్థితి నుండి ట్రంప్‌ తృటిలో తప్పించుకోగలుగుతున్నారు. ఇంత అప్రదిష్ట, అపకీర్తి, అవమానాలు మూటగట్టుకొని ట్రంప్‌ వైట్‌హౌస్‌ వీడుతున్నారు. అందుకు ఆయన ఏమాత్రం సిగ్గుపడకపోవడమే చాలా విచిత్రం. 


Related Post