రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల ఎన్నికల హడావుడి

January 09, 2021


img

త్వరలో ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలు, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఇవన్నీ రాబోయే రెండు నెలలో జరుగబోతున్నాయి. కనుక రాష్ట్రంలో మళ్ళీ రాజకీయవాతావరణం వేడెక్కుతోంది. 

దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో సమరోత్సాహంతో ఉన్న బిజెపి ఈ ఎన్నికలలో కూడా గెలిచి తన సత్తా చాటుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. అందుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ తరుణ్ చుగ్‌, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇద్దరూ కలిసి నిన్న ఖమ్మంలో పర్యటించి పార్టీ క్యాడర్‌తో సమావేశం నిర్వహించి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురూ సిఎం కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ్ళ వారిరువురూ వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ కూడా ఇదేవిదంగా జరుగుతుందని వేరే చెప్పక్కరలేదు. 

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో పత్తాలేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీకి తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ వరుస ఎన్నికలు ఒక అవకాశంగా చెప్పవచ్చు. అలాగే ఈ ఎన్నికలు దానికి అగ్నిపరీక్షగా కూడా నిలుస్తాయి. పిసిసి అధ్యక్ష పంచాయతీకి తాత్కాలికంగా విరామం ఇచ్చినందున మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృవ్తంలోనే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ కూడా సిద్దమవుతోంది. అయితే ఇంకా ఖమ్మం, వరంగల్‌లో కాంగ్రెస్‌ హడావుడి మొదలవలేదు కానీ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా కాంగ్రెస్‌ నేతలందరూ ఇవాళ్ళ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపట్టనున్నారు. పిసిసి పంచాయితీలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకొన్న కాంగ్రెస్‌ నేతలందరూ ఇవాళ్ళ మళ్ళీ ఒక్క వేదికపైకి వచ్చి మాట్లాడుకొంటారు కనుక ఇది మునిసిపల్ ఎన్నికలకు సన్నాహంగానే భావించాలేమో?

ఒకప్పుడు బిజెపిని టిఆర్ఎస్‌ అసలు పట్టించుకొనేది కాదు...కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని రాజకీయ యుద్ధాలు చేస్తూండేది. కానీ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ని పక్కన పెట్టి ఇప్పుడు నిత్యం బిజెపి నామస్మరణ చేస్తోంది. ఈ వరుస ఎన్నికలలో బిజెపిని ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్‌ ఎప్పుడో సన్నాహాలు మొదలుపెట్టేసింది. దానిలో భాగంగానే 50,000 ఉద్యోగాల భర్తీ ప్రకటన, ఉద్యోగుల పీఆర్సీ, పదోన్నతులు వగైరా వరాలు కురిపిస్తోంది. ఈ ఎన్నికలు మూడు పార్టీలకు జీవన్మరణ సమస్య వంటివే కనుక ఇంకా రసవత్తరంగా ఉండబోతున్నాయి. 


Related Post