త్వరలో జైలు నుంచి శశికళ విడుదల

January 08, 2021


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ ఈనెల 27న బెంగళూరు జైలు నుంచి విడుదలకానున్నారు. ఆమె జైలులో ఉండగానే ఆదాయపన్ను ఎగవేత కేసుపై మద్రాస్ హైకోర్టు ఇటీవల విచారణ జరిపినప్పుడు ఆమె తరపు న్యాయవాది హైకోర్టుకు ఈవిషయాన్ని తెలియజేశారు. ఆమె న్యాయవాది అభ్యర్ధన మేరకు మద్రాస్ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. 

జయలలిత బ్రతికి ఉండగా…ఆ తరువాత ఆమె ఆరోగ్యం విషమించి సుమారు రెండు నెలలు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ శశికళ అన్నాడీఎంకె పార్టీని, తమిళనాడు రాజకీయాలను శాసించారు. జయలలిత చనిపోయిన తరువాత పార్టీని హస్తగతం చేసుకొన్న శశికళ, ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకొనేందుకు చాలా చురుకుగా పావులు కదిపారు. కానీ మద్యలో కేంద్రప్రభుత్వం కలుగజేసుకొని అక్రమాస్తుల కేసులో ఆమెను జైలుకి పంపించడంతో అన్నాడీఎంకె నేతలు ఊపిరి పీల్చుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆమె జైలు నుంచి విడుదలై మళ్ళీ చెన్నైలో అడుగుపెడితే పార్టీని నిలువునా చీల్చి ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని అన్నాడీఎంకె నేతలలో ఆందోళన మొదలైంది. ఆమెను ఎదుర్కోవాలంటే మళ్ళీ కేంద్రప్రభుత్వం సహకారం తప్పనిసరి. 

త్వరలో జరుగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అధికార అన్నాడీఎంకె పార్టీతో జతకట్టి ఎలాగైనా కొన్ని సీట్లు గెలుచుకొని ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలని బిజెపి తాపత్రయపడుతోంది. కనుక కేంద్రప్రభుత్వమే మళ్ళీ శశికళను కట్టడి చేస్తుందేమో?ఏది ఏమైనప్పటికీ శశికళ విడుదలైతే తమిళనాడులోని అన్ని పార్టీలకు గండమే అని చెప్పవచ్చు.


Related Post