కరోనా వ్యాక్సిన్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరాలు

January 04, 2021


img

కరోనా నివారణ కోసం అందుబాటులోకి వచ్చిన కోవీషీల్డ్, కోవాక్సిన్‌ల వినియోగానికి డీసీజీఐ అనుమతించడాన్ని కాంగ్రెస్‌తో సహా దేశంలో కొన్ని ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు వాక్సిన్లు 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తికాక మునుపే వాటి వినియోగానికి అనుమతించి, మోడీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ శశీ ధరూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ లక్నోలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఈ వ్యాక్సిన్‌పై నమ్మకం లేదు కనుక నేను దీనిని తీసుకోను. అయినా బిజెపి ప్రభుత్వం తయారుచేయించిన ఈ వ్యాక్సిన్‌ను ఏవిధంగా నమ్మగలము? క్లినికల్ ట్రయల్స్‌ పూర్తవకుండా ఇంత అత్యవసరంగా వ్యాక్సిన్‌ పంపిణీకి అనుమతించవలసిన అవసరం ఏమిటి? మోడీ ప్రభుత్వం దీనిపై అనవసరమైన హడావుడి చేసి దాని గురించి గొప్పగా ప్రచారం చేసుకొని పేరు సంపాదించుకోవాలనుకొంటోంది. అందుకోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదు,” అని అన్నారు.    

సీనియర్ కాంగ్రెస్‌ నేత ఆనంద్ శర్మ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. కనుక ఇదివరకులా అత్యవసర పరిస్థితులు లేవు. కానీ అత్యవసర వినియోగం కోసం అంటూ వాక్సిన్లకు ఎందుకు అనుమతించారు?వాక్సిన్ తయారీలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదు?” అని ప్రశ్నించారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేతలు రణదీప్ సుర్జేవాలా, జైరాం రమేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “భారత్‌ బయోటెక్ కంపెనీ నిసందేహంగా చాలా గొప్ప నాణ్యతా ప్రమాణాలు పాటించే గొప్ప సంస్థే. కోవాక్సిన్ తయారుచేసిన శాస్త్రవేత్తలు కరోనాను సవాలుగా తీసుకొని రేయింబవళ్ళు కష్టపడి కోవాక్సిన్‌ను తయారుచేశారు. కానీ ప్రోటోకాల్ ప్రకారం దానికి 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తికాకమునుపే కోవాక్సిన్‌ను ఎందుకు వినియోగానికి డీసీజీఐ అనుమతించింది? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అవుతుంది,” అని అన్నారు. 


Related Post