నేనొక లైలాను...మజ్నూలు చాలా మందే ఉన్నారు: ఓవైసీ

January 04, 2021


img

త్వరలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటివరకు పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్‌ పార్టీ ఆ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకొంది. మజ్లీస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముందుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు ఫోన్‌ చేసి ఎన్నికలలో కలిసి పనిచేద్దామని అడిగారు. కానీ ఆమె నిరాకరించడంతో ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే నిన్న బెంగాల్ రాష్ట్రంలో పర్యటించారు. 

ఈసారి ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి చాలా పట్టుదలగా ఉంది. ఇదే సమయంలో మజ్లీస్‌ కూడా బెంగాల్లో ప్రవేశించాలనుకోవడంతో మమతా బెనర్జీకి రెండు వైపుల నుంచి ఒత్తిళ్ళు ఎదుర్కోవలసి వస్తోంది. ఆ రెండు పార్టీలు తనను గద్దె దించేందుకే ఓ రహస్య అవగాహనతో రాష్ట్రానికి వస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. మజ్లీస్‌ పార్టీ బిజెపికి బీ-టీమ్ అని ఆమె ఆరోపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో మతపరమైన సెంటిమెంట్లు రగిలించి హిందూ, ముస్లిం ఓట్లు చీల్చడం ద్వారా ఒకదానికొకటి సహకరించుకొంటూ తమ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. 

మమతా బెనర్జీ ఆరోపణలపై అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, “ఒక రాజకీయపార్టీగా మేము దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కనుక ఆమె అభ్యంతరం చెప్పలేరు. నిజానికి ఆమె తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తన భయాలను కప్పి పుచ్చుకొనేందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారు. కనుక ఆమె మాపై ఆరోపణలు చేసే బదులు తన పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకొంటే ఆమెకే మంచిది. నేను ఓ లైలా వంటివాడిని...దేశవ్యాప్తంగా నన్ను ఇష్టపడే మజ్నూలు చాలా మందే ఉన్నారు. అటువంటివారు నా రాజకీయ ప్రయత్నాలతో లబ్ది పొందాలనుకొంటున్నారు,” అని అన్నారు.


Related Post