కొత్త సంవత్సరంలో బాంబు పేల్చిన రాజగోపాల్ రెడ్డి

January 01, 2021


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త సంవత్సరం మొదటిరోజునే పెద్ద బాంబు పేల్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నందున రానున్న రోజులలో నేను బిజెపిలో చేరే అవకాశం ఉంది. టిఆర్ఎస్‌కు ఎప్పటికైనా బిజెపియే ప్రత్యామ్నాయమని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. నేను బిజెపిలో చేరినప్పటికీ నా సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం ఉంది,” అని అన్నారు. 

పిసిసి అధ్యక్షపదవికి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ మానిక్కం ఠాగోర్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలందరితో వరుసగా సమావేశాలు నిర్వహించినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పదవిని ఆశిస్తున్న జగ్గారెడ్డి, వి.హనుమంతరావు వంటివారు కూడా మద్దతు పలికారు కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం గాంధీభవన్‌కు వచ్చి సోదరుడికి మద్దతు పలుకలేదు. బహుశః ఈ కారణం చేతే మద్దతు పలుకలేదేమో?

నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదివరకే బిజెపిలో చేరిపోయేందుకు సిద్దపడ్డారు. అయితే ఇంతవరకు అన్నదమ్ములిద్దరూ ఒకే మాట...ఒకే బాట...అన్నట్లు సాగి, వేర్వేరు పార్టీలలో ఉంటే రాజకీయంగా, కుటుంబపరంగా ఇబ్బందులు వస్తాయని వెనక్కు తగ్గినట్లున్నారు. 

కానీ ఇప్పుడు బిజెపిలో చేరుతానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రాజకీయంగా నష్టం కలిగించవచ్చు. ఆయన బిజెపిలో చేరడానికి సిద్దపడినందున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పిసిసి అధ్యక్షపదవి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం నిరాకరించే అవకాశం ఉంది లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా ఒప్పిస్తేనే పిసిసి అధ్యక్షపదవి ఇస్తామని షరతు విధించవచ్చు.


Related Post