మరో మెట్టు దిగిన సిఎం కేసీఆర్‌?

December 31, 2020


img

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఓటములు టిఆర్ఎస్‌పై కంటే సిఎం కేసీఆర్‌పైనే ఎక్కువ ప్రభావం చూపినట్లున్నాయి. తెలంగాణలో తనకు తిరుగేలేదని భావిస్తున్న ఆయనకు ఈ రెండు వరుస ఓటములు వ్యక్తిగత ఓటములే అని చెప్పవచ్చు. బహుశః అందుకే ఇప్పుడు ఒక్కో మెట్టు దిగుతున్నట్లున్నారు. ధరణీ కోసం రాష్ట్రంలో మూడు నెలలపాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయించే సాహసానికి పూనుకొన్న సిఎం కేసీఆర్‌ దాంతో ఆర్ధిక, సాంకేతిక, న్యాయ, రాజకీయ సమస్యలు ఎదురవడంతో వెనక్కు తగ్గారు. అలాగే ప్రతిపక్షాలు ఎంతగా మొత్తుకొన్నా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తని సిఎం కేసీఆర్‌ ఒకేసారి 50,000 ఉద్యోగాల భర్తీకి సిద్దపడ్డారు. అలాగే పీఆర్‌సీ, ఉద్యోగులకు జీతాల పెంపు, పదోన్నతులకు సిద్దపడ్డారు. ఇవన్నీ రెండు వరుస ఓటములు... త్వరలో జరుగబోయే వరుస ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసినవే అనుకోవచ్చు. 

కానీ అపర చాణక్యుడుగా పేరొందిన సిఎం కేసీఆర్‌ ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రంలో బిజెపి ఇంత బలం పుంజుకొని తనకే సవాలు విసిరి ఓడించగలదని ముందుగా ఊహించలేకపోవడమే చాలా ఆశ్చర్యకరం. ప్రతీ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలువబోతోందని సర్వేలు చెపుతున్నాయని చెప్పే సిఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో బిజెపి బలపడుతోందని తెలియదనుకోవాలా లేక దాని బలాన్ని, వ్యూహాలను తక్కువగా అంచనా వేసి ఎదురుదెబ్బలు తిన్నారా?అనే సందేహం కలుగకమానదు. 

కానీ రాష్ట్రంలో బిజెపి బలపడిందని గుర్తించినందునే సిఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్ళి కేంద్రంతో రాజీపడ్డారా?అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని, కేంద్రహోంమంత్రి అమిత్ షాలను కలిసి వచ్చిన తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్‌ బంద్‌లో టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆ వ్యవసాయచట్టాల ప్రకారమే రైతులు తమ పంటలను ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకోవాలని చెపుతున్నారు. అలాగే ఆయుష్మాన్ భారత్‌ పధకం పనికిరాదని దాని కంటే తమ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యశ్రీ ఎంతో ఉత్తమమైనదని పదేపదే వాదించిన సిఎం కేసీఆర్‌, ఇప్పుడు దాంతోనే ఆరోగ్యశ్రీని అనుసందానం చేసి రాష్ట్రంలో రెంటినీ అమలుచేయడానికి ఒప్పుకోవడం చూస్తే మరో మెట్టు దిగినట్లు భావించవచ్చు. 

సిఎం కేసీఆర్‌ కేంద్రంతో రాజీపడినా రాష్ట్రంలో బిజెపి వెనక్కు తగ్గబోదని బండి సంజయ్‌ మాటలు, దూకుడుతోనే అర్ధమవుతోంది. కనుక త్వరలో జరుగబోయే వరుస ఎన్నికలలో బిజెపిని ఎదుర్కొనేందుకు సిఎం కేసీఆర్‌ ఏమి చేయబోతున్నారు?అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు.


Related Post