రజనీ నిర్ణయం బాధ కలిగించింది: కమల్ హాసన్‌

December 30, 2020


img

త్వరలోనే కొత్త రాజకీయపార్టీతో ప్రత్యక్షరాజకీయాలలోకి వస్తానని చెప్పిన రజనీకాంత్‌ ఆరోగ్య సమస్యల కారణంగా ఆ ఆలోచనను విరమించుకొన్నట్లు ప్రకటించడంపై ఆయన సహ నటుడు, ‘మక్కల్ నీది మయ్యమ్’ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ స్పందించారు. “రజినీకాంత్‌ రాజకీయాలలోకి వస్తానని చెప్పినప్పుడు అందరి అభిమానుల్లాగే నేను కూడా చాలా సంతోషించాను. కానీ ఇప్పుడు ఆయన నిర్ణయం విన్నాక నేను కూడా బాధపడుతున్నాను. త్వరలోనే ఆయనను కలిసి మాట్లాడుతాను,” అని చెప్పారు. 

రజినీకాంత్‌ కొత్తపార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే కమల్ హాసన్‌ఆయన పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనుకొన్నారు. కానీ రజినీకాంత్ మొదటే ఆ ప్రతిపాదనపట్ల వ్యతిరేకత కనబరిచారు. అంటే ఒకవేళ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం చేస్తే కమల్ హాసన్‌కు ఆయన పార్టీ నుంచి కూడా పోటీ ఎదుర్కోవలసి వచ్చేది. కానీ రజినీ చివరి నిమిషంలో వెనక్కు తగ్గడంతో మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి పోటీ తప్పింది కనుక కమల్ హాసన్‌ లోలోన చాలా సంతోషిస్తుంటారని భావించవచ్చు. 

రజినీకాంత్‌ రాజకీయాలలో ప్రవేశించవలసిన సమయంలో భయపడుతూ దేవుడి అనుమతి లభించలేదంటూ విలువైన సమయాన్ని రాజకీయ అవకాశాలను వృధా చేసుకొని, రాజకీయాల నుంచి నిష్క్రమించవలసిన వయసులో రాజకీయాలలో ప్రవేశించాలనుకోవడం చాలా పొరపాటు నిర్ణయమే అని చెప్పవచ్చు. చివరికి రజినీకాంత్‌ ధైర్యం చేసినా ఆరోగ్యం సహకరించదని గ్రహించి వెనక్కుతగ్గడం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. 


Related Post