విమానం దిగి క్వారెంటైన్‌కు వెళ్ళాలంటే ఎలా?

May 26, 2020


img

లాక్‌డౌన్‌ అమలు విషయంలో దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలుచేసి సత్ఫలితాలు సాధించిన కేంద్రప్రభుత్వం, క్వారెంటైన్‌ విషయంలో అన్ని రాష్ట్రాలలో ఒకే విధానం అమలుచేసేలా చేయకపోవడంతో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర ప్రాంతాల నుంచి విమానాలలో వచ్చినవారికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా క్వారెంటైన్‌ అమలుచేస్తుండటంతో వాటిని భరించలేక చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకొంటున్నారు. దాంతో మొదటిరోజే అనేక విమానాలు రద్దయ్యాయి. ఆ కారణంగా అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థలు కూడా భారీగా నష్టపోతున్నాయి. 

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విమాన ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమే. కానీ శలవుపై ఇళ్ళకు వెళ్ళే ఉద్యోగులు, వ్యాపారాలు, ఇతర పనులపై వేరే ప్రాంతాలకు వెళ్ళివచ్చేవారిని విమానం దిగగానే 7 నుంచి 14 రోజులు క్వారెంటైన్‌లో ఉండమంటే, ఇక బయలుదేరడం ఎందుకని వారు ప్రయాణాలు రద్దు చేసుకోవలసి వస్తోంది. 

కొన్ని రాష్ట్రాలలో విమాన టికెట్ బుకింగ్ విషయంలో పెడుతున్న షరతులు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఉదాహరణకు రైలు, విమాన ప్రయాణాలు చేయాలనుకొనేవారు తప్పనిసరిగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యసేతు మొబైల్ యాప్ కలిగి ఉండాలి. లేదా తమకు కరోనా లేదని తెలియజేస్తూ లేఖ సమర్పించవలసి ఉంటుంది. దీనికి అదనంగా ఏపీకి వచ్చిపోవాలనుకొనేవారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘స్పందన’ వెబ్‌సైట్‌లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవలసి ఉంటుంది. దానిలో క్లియరెన్స్ లభిస్తేనే విమానయాన సంస్థలు టికెట్స్ జారీ చేస్తాయి. 

విమానాశ్రయానికి చేరుకొన్నాక అక్కడ మళ్ళీ కరోనా నిబందనలు, పరీక్షలు ఉండనే ఉంటాయి. ఈ తతంగం అంతా పూర్తి చేసుకొన్నాక ఆఖరు నిమిషంలో విమానం రద్దు అయ్యిందనే ప్రకటన వెలువడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. ఇంతకంటే ప్రయణాలు మానుకోవడమే మంచిదని వారు అనుకొంటే తప్పు కాదు. కనుక పౌరవిమానయాన శాఖ తక్షణం ఈ ఆంక్షలు, నిబందనలను సరిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.


Related Post