ప్రతిపక్షాల వ్యూహం ఫలిస్తుందా...బెడిసికొడుతుందా?

May 16, 2020


img

కృష్ణా నదీ జలాల వినియోగంపై ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల మద్య మొదలైన తాజా వివాదంలో రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని గట్టిగా వాదిస్తున్నాయి. కానీ దాని కోసం అవి ఏపీ ప్రభుత్వంతో పోరాడే బదులు దానితో పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. 

సిఎం కేసీఆర్‌ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో కుమ్మక్కు అయ్యారని అందుకే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తరలించుకు పోయేందుకు సిద్దపడుతున్నా, సిఎం కేసీఆర్‌ గట్టిగా మాట్లాడటం లేదని వాదిస్తున్నారు. సిఎం కేసీఆర్‌ వైఖరి వలన తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని వాదిస్తున్నారు. ఈ అంశంపై సిఎం కేసీఆర్‌ నేరుగా ఏపీ సిఎం జగన్‌తో ఎందుకు మాట్లాడటం లేదని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అడ్డుకొంటామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

నిజానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై మొట్టమొదట అభ్యంతరం తెలిపింది సిఎం కేసీఆరే! ఆయనే అధికారులను  పరుగులెత్తించి కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయించారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదుపై స్పందించిన కృష్ణాబోర్డు వెంటనే ఏపీ ప్రభుత్వాన్ని దీనిపై వివరణ కోరుతూ నోటీసు పంపింది. ట్రిబ్యూనల్‌కు వెళితే ఆలస్యమవుతుంది కనుక దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుదామని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అంటే కేసీఆర్‌ ప్రయత్నలోపం ఏమీలేదని స్పష్టమవుతోంది. 

కానీ రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిలు సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తుండటం గమనిస్తే, అవి ఈ అంశంపై ఎంతో కొంత ‘రాజకీయ మైలేజీ’ పొందాలని ఆరాటపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డిను సిఎం కేసీఆర్‌ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నిస్తున్న ఆ రెండు పార్టీలు, ఏపీలో తమ పార్టీల చేత పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును వ్యతిరేకించమని చెప్పగలవా? రేపు ఏపీ కాంగ్రెస్‌, బిజెపిలు తమ మనుగడను కాపాడుకోవడం కోసం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అనుకూలంగా పోరాటాలు, దీక్షలు మొదలుపెడితే, అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌, బిజెపిలు ఏమి చెప్తాయి? 

ఏపీతో తలెత్తే ఏ వివాదంలోనైనా టిఆర్ఎస్‌ నిఖచ్చిగా పోరాడగలదు ఎందుకంటే దానికి ఏపీలో పార్టీ శాఖ లేదు. కనుక రాజకీయ ప్రయోజనాలు కూడా ఉండవు. కానీ రెండు రాష్ట్రాలలో శాఖలున్న కాంగ్రెస్‌, బిజెపిలు టిఆర్ఎస్‌లాగ ఒకే వైఖరితో పోరాడలేవు. కనుక ఏ ఎండకు ఆ గొడుగు పట్టక తప్పదు. అదే వాటి బలహీనత! 

కనుకనే అవి ఇక్కడ సిఎం కేసీఆర్‌ను, అక్కడ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని పోరాడుతుంటాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రంతో... అక్కడ ఉన్న తమ పార్టీ శాఖలతో ఎన్నటికీ పోరాడలేవు. ఈవిధంగా అవి ఎంతగా పోరాడిన అవి ఆశించిన ‘రాజకీయ మైలేజీ’ లభించకపోవచ్చు. పైగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సిఎం కేసీఆర్‌పై ఈవిధంగా విమర్శలు గుప్పిస్తే వాటిపట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంటుందని గ్రహిస్తే మంచిది.


Related Post