చైనాను దాటిపోయిన భారత్‌

May 16, 2020


img

చైనాను ఏ రంగంలోనైనా భారత్‌ అధిగమించడం కష్టమే కానీ కరోనా కేసుల విషయంలో చైనాను అధిగమించేసింది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 85,940కి చేరింది. చైనాలో ఇప్పటివరకు 82,933 కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా కేసుల సంఖ్యలో కూడా చైనా నిజాలు దాచిపెడుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాలో ఓ యూనివర్సిటీ అంచనాల ప్రకారం చైనా చెపుతున్న దానికి సుమారు 4 రెట్లు అధికంగా కరోనా కేసులు, మృతులు ఉండవచ్చని అంచనా వేసింది. 

చైనా లెక్కలను పక్కనపెట్టి మనదేశంలో నానాటికీ పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూస్తుంటే, మరో 3-4 రోజులలోనే భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 30,153 మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 53,035 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2,752 మంది కరోనాతో మృతి చెందారు. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించక తప్పదు.


Related Post