వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలదే: కేంద్రం

May 16, 2020


img

వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు చేర్చేందుకు సుమారు 800 శ్రామిక్ రైళ్ళు నిరంతరంగా తిరుగుతున్నాయి. కానీ లక్షల సంఖ్యలో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవి ఏమాత్రం సరిపోవు కనుక నేటికీ అనేక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో వలస కార్మికులు, తమ భార్యాపిల్లలను వెంటబెట్టుకొని కాలినడకన, తోపుడుబళ్ళు, సైకిల్స్, లారీలపై    కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఊర్లకు వెళుతున్నారు. 

ఇంత మండువేసవిలో...నడిరోడ్డుపై ఆకలిదప్పులతో బాధపడుతూ..చిన్న పిల్లలను భుజాన్న మోసుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. కొందరు గమ్యం చేరేలోగానే పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొందరు రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు. ఈ బాధాకరమైన వలసలపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇది మీ బాధ్యత అంటే కాదు.. మీ బాధ్యతేనంటూ’ వాదోపవాదాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండటం ఇంకా బాధాకరం. 

        


కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా రాష్ట్రాలకు వ్రాసిన తాజా లేఖలే ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దానిలో “వలస కార్మికులు సురక్షితంగా వారి స్వరాష్ట్రాలకు చేర్చే బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలదే. వారికి దారిలో ఆహారం, మంచినీళ్ళు, తాత్కాలిక గుడారాలు, అంబులెన్సులు, వైద్య సదుపాయం వంటివన్నీ కల్పించాలి.  వలస కార్మికులు తరలింపు కోసం రైల్వేశాఖ శ్రామిక్ రైళ్లను నడిపిస్తోంది కనుక వారిని ఆ రైళ్లలో పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. అవసరమైతే మరిన్ని శ్రామిక్ రైళ్ళు నడిపించేందుకు రైల్వేశాఖ సిద్దంగా ఉంది,” అని దాని సారాంశం. 

     


కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు చాలా సమర్ధంగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయగలవు. ప్రభుత్వాలను నడిపిస్తున్న అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు తమకున్న వనరులన్నిటినీ చాలా సమర్ధంగా ఉపయోగించుకొంటూ పనిచేస్తుంటాయి. ఓ నియోజకవర్గం లేదా ఓ వార్డులో ఎంతమంది ఓటర్లున్నారు? వారిలో ఏ కులం, మతానికి చెందినవారు ఎంతమంది ఉన్నారు? వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి వ్యూహాలు అమలుచేయాలి? వంటివన్నీ మన రాజకీయపార్టీలకు చాలా బాగా తెలుసు. కానీ కళ్లెదుటే లక్షల సంఖ్యలో వలస కార్మికులు రోడ్లపై వందల కిలోమీటర్లు కాలినడకన సాగిపోతుంటే ఏమి చేయాలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదు. కనీసం వారికి దారిలో సదుపాయాలు కల్పించాలనే ఆలోచన కూడా కలగకపోవడం...ఆ బాధ్యత తీసుకోవడానికి వెనకాడుతుండటం చాలా బాధాకరం. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలొ మానవత్వం లేకపోవడం వలననే ఈవిధంగా వ్యవహరిస్తున్నాయనుకోక తప్పదేమో.


Related Post