భారత్‌లో కేసుల కంటే అమెరికాలో మృతులే ఎక్కువ

May 16, 2020


img

అమెరికాలో కరోనా సృష్టిస్తున్న విధ్వంసం అనూహ్యంగా ఉంది. మొదట్లో ట్రంప్‌ ప్రభుత్వం కరోనాను చాలా తేలికగా తీసుకోవడం వలన చాప క్రింద నీరులా విస్తరించగా, ఇప్పుడు దానిని కట్టడి చేయలేని నిసహాయత కారణంగా శరవేగంగా పెరుగుతోంది. అమెరికాలో కరోనా ఏ స్థాయిలో ఉందంటే భారత్‌లో కరోనా కేసుల కంటే అమెరికాలో మృతుల సంఖ్యే ఎక్కువగా ఉంది. 130 కోట్లుకు పైగా భారీ జనాభా ఉన్న భారత్‌లో 51 రోజులలో 82,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో అమెరికాలో కరోనాతో 86, 571 మంది చనిపోయారు. 

ఒకపక్క తరుముకొస్తున్న ఆర్ధికమాంద్యం నిరుద్యోగం వంటి సమస్యల నుంచి బయటపడి అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కొనేందుకు ట్రంప్‌ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి, పూర్తిస్థాయిలో అన్ని వ్యవస్థలను పనిచేయించాలని నిర్ణయించడంతో అమెరికాలో కరోనా వ్యాప్తి ఇంకా పెరిగిపోతోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ప్రస్తుతం 14,48,810 మంది కరోనా పేషంట్లున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 

అమెరికాలో ఒకప్పుడు న్యూయార్క్ (3,43,051), న్యూజెర్సీ (1,42,704), ఇల్లీనాయిస్ (84,698 కేసులు) రాష్ట్రాలలోనే కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వాటితో సహా మసాచూసెట్స్ (80,497), కాలిఫోర్నియా (71,141), పెన్‌సల్వేనియా (59,636), మిచిగాన్ (49,582) రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. మరో ఆరు రాష్ట్రాలలో 25,000 నుంచి 50,000 కేసులు చొప్పున నమోదు కాగా మరో 12 రాష్ట్రాలలో 10,000 నుంచి 25,000 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

కానీ కరోనాతో కలిసి బ్రతకడం తప్పదని, దానికి వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేవరకు ప్రజలు మూల్యం (?) చెల్లించక తప్పదని ట్రంప్‌ తేల్చి చెప్పేశారు. కరోనాను అడ్డుకొనేందుకు ట్రంప్‌ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ అది ఇప్పట్లో ఆగదని ఇప్పటికే స్పష్టమయింది. కనుక ట్రంప్‌ చెప్పినట్లు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ఒక్క అమెరికా మాత్రమే కాక ప్రపంచదేశాలన్నీ కూడా మూల్యం చెల్లించకతప్పక పోవచ్చు. 



Related Post